భారత్ ఓటమి: సెహ్వాగ్ ఫుల్ కామెడీ!
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. పొగడటంలో అయినా, విమర్శించడంలో అయినా తనది ప్రత్యేక శైలి అని మరోసారి నిరూపించుకున్నాడు సెహ్వాగ్. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో పుణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతకుముందు భారత తొలి ఇన్నింగ్స్ పై స్పందిస్తూ.. మరో ట్వీట్లో అంపైర్ల పనిపై చమత్కరించాడు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంపైర్లు కేవలం ఇదే పని చేశారంటూ బ్యాట్స్‌మన్ అవుటైనప్పుడు అంపైర్స్ సూచించే నిర్ణయంలా చూపుడువేలును పైకెత్తి చూపుతూ పోస్ట్ చేశాడు. భారత బ్యాటింగ్‌ను విమర్శించేలా సరదాగా ట్వీట్ల పర్వం కొనసాగించాడు.
ఆట మూడోరోజు కొనసాగుతుండగా సూటు బూటులో ఉన్న సెహ్వాగ్ ఓ ఫొటోతో ట్వీట్ చేశాడు. 'ముందుగా లంచ్ లోపే ఆసీస్ ను ఆలౌట్ చేయడండి. ఆ పై టీమిండియా బ్యాటింగ్ కు త్వరగా దిగాలని' తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే టెస్టుల్లో గేల్ వ్యక్తిగత అత్యధిక స్కోరు(333)ను సూచించేలా గేల్ ధరించే జెర్సీని, భారత్ ఓటమి పాలైన 333 పరుగులు సరిపోయాయంటూ ట్వీట్ చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ట్వీట్‌ను సెహ్వాగ్ డిలీట్ చేయడం గమనార్హం. మహ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్ సహా మాజీ ఆటగాళ్లు మాత్రం టీమిండియాకు నైతిక మద్దతు తెలిపారు.