
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అండర్–15 చెస్ టోర్నమెంట్‌లో విశ్వక్‌సేన్, హిమసూర్య, అజితేశ్ సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాలికల విభాగంలో యజ్ఞప్రియ, ప్రణీత ప్రియ, సశ్య సింగారెడ్డి ఉమ్మడిగా దూసుకెళ్తున్నారు. అబిడ్స్‌లోని తెలంగాణ రాష్ట్ర సంఘం కార్యాలయంలో ఆదివారం ఈ పోటీలు మొదలయ్యాయి. బాలికల విభాగంలో తొలి రోజు రెండు రౌండ్లు, బాలుర విభాగంలో మూడు రౌండ్లు నిర్వహించారు. ఈ మూడు రౌండ్లలోనూ విశ్వక్‌సేన్, హిమసూర్య, అజితేశ్, హిమాన్షు అగర్వాల్‌లు గెలుపొందారు. దీంతో వీరంతా మూడేసి పాయింట్లతో ఉన్నారు. మూడో రౌండ్ పోటీల్లో విశ్వక్‌సేన్ (3)... ప్రద్యుమ్న (2)పై, హిమసూర్య (3)... సాయి రిత్విక్ (2)పై, అజితేశ్ (3)... విశ్వ అలకంటి (2)పై విజయం సాధించారు. బాలికల విభాగంలో జరిగిన రెండో రౌండ్లో యజ్ఞప్రియ (2)... శేషసాయి సర్వేణి (1)పై గెలుపొందగా, మహిత (1)ను ప్రణీత ప్రియ (2) ఓడించింది. సశ్య సింగారెడ్డి (2)... సంకీర్తన (1)పై విజయం సాధించింది. యజ్ఞప్రియ, ప్రణీత, సశ్యలు రెండేసి పాయింట్ల చొప్పున ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సోమవారం మిగతా రౌండ్లు పూర్తయ్యాక విభాగానికి నలుగురు చొప్పున 8 మంది క్రీడాకారుల్ని రంగారెడ్డి జిల్లా చెస్ జట్టుకు ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment