
సచిన్ చెప్పినవన్నీ వాస్తవాలే:లక్ష్మణ్
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ ఛాపెల్ గురించి ప్రస్తావించిన విషయాలన్నీ వాస్తవాలేనని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ఛాపెల్ కోచ్ గా ఉన్నన్నాళ్లూ ఓ రింగ్ మాస్టర్ లా వ్యవహరించేవాడని సచిన్ పేర్కొన్న విషయాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే సచిన్ ఆత్మకథను సమర్ధించిన సౌరభ్ గంగూలీకి తాజాగా లక్ష్మణ్ జత కలిశాడు. 'సచిన్ ఆత్మకథ పుస్తకంలో రాసిన విషయాలన్నీ వాస్తవాలే. ఛాపెల్ కోచ్ గా ఉన్న 2005 నుంచి 2007 కాలంలో అన్నీ వివాదాలే. ఆటగాళ్లు అతని చెప్పుచేతల్లోనే ఉండాలని ఛాపెల్ భావించేవాడు' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
2006 వ సంవత్సరంలో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ జరిగిన సమయంలో నన్న ఓపెనింగ్ చేయమని ఛాపెల్ చెప్పాడని.. అయితే ఆ ఓపెనింగ్ విషయాన్ని తాను తిరస్కరించానన్నాడు. కాగా, మళ్లీ ఇదే అంశాన్ని ఛాపెల్ తన వద్ద ప్రస్తావించి బెదిరింపులకు పాల్పడ్డ విషయాన్ని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. వెస్టిండీస్ టూర్ కు వెళ్లే సమయంలో ఓపెనింగ్ చేయాలని తనను ఛాపెల్ ఇబ్బంది పెట్టాడనన్నాడు. ఒకవేళ ఓపెనింగ్ చేపట్టకపోతే 31 ఏళ్లలో తిరిగి జట్టులోకి రావడం కష్టసాధ్యమవుతుందని ఛాపెల్ బెదరించిన మాట వాస్తవమేనని లక్ష్మణ్ తెలిపాడు.ఛాపెల్ కోచ్ గా ఉన్న కాలంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దారుణంగా ఉండేదన్నాడు. ఆటగాళ్ల మధ్య చిచ్చుపెట్టడానికే ఛాపెల్ యత్నించేవాడని లక్ష్మణ్ మండిపడ్డాడు. అతని వల్ల భారత్ క్రికెట్ చాలా నష్టపోయిందని విమర్శించాడు.