
చివరి బంతికి సెంచరీ కొట్టి...
బ్రిస్ బేన్: పాకిస్థాన్తో జరుగతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మథ్యూ వాడే రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చివరి బంతి సహాయంతో కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. 7(ఫోర్లు), 2(సిక్సర్లు)తో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్కు మహ్మద్ అమీర్ రూపంలో గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (7), కెప్టెన్ స్టీవ్ స్మీత్ వికెట్లను (0) వెనువెంటనే కోల్పోయింది. ఒక దశలో 78 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు మథ్యూ వాడే ఆపద్బాంధవుడులా నిలిచాడు. తీవ్ర ఒత్తిడిలో ఆచితూచి ఆడుతూ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్తో కలిసి 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
మరో వైపు మ్యాక్స్ వెల్ వికెట్ల మధ్య చురుకుగా కదులుతూ అద్భుతమైన రివర్స్ స్వీప్స్, చూడచక్కని షాట్లతో 56 బంతుల్లో 60 (7ఫోర్లు) పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ వేసిన 31వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించబోయి మహ్మద్ హఫీజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సొంత గ్రౌండ్ గబ్బాలో తొలి వన్డే ఆడుతున్న క్రిష్ లిన్ 16 (12) అమీర్ వేసిన ఓవర్లో ఏకంగా 97 మీటర్ల భారీ సిక్సర్ ను కొట్టిన అనంతరం హసన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ స్వ్కేర్, కవర్ డ్రైవ్స్ తో బంతిని పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో 39 పరుగులు అనంతరం స్పిన్నర్ ఇమాద్ వసీంకు దొరికి పోయాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మథ్యూ సెంచరీ చేసి ఆసిస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు కృషి చేశాడు. టేలెండర్స్తో కలిసి మాథ్యూ చేసిన ఒంటరి పోరాటం ఫలితంగా ఆస్ట్రేలియా 268 పరుగులు చేయగలిగింది.
పాక్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ తన తల్లికి సీరియస్ గా ఉండటంతో స్వదేశానికి వెళ్లగా.. అతని స్థానంలో జట్లులోకి వచ్చిన రిజ్వాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇన్నింగ్స్ లో తొమ్మిది ఓవర్లు వేసిన హాసన్ 65 పరుగులిచ్చి, మూడు వికెట్లు తీశాడు.
బ్యాట్స్‌మెన్‌ల పేలవ ప్రదర్శనతో పాక్ 176 పరుగులకే ఆలౌటైంది. ఫాల్క్‌నర్ 4, కమ్మిన్స్ 3 వికెట్లు తీసి పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో 92 పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. పాక్‌లో బాబర్ అజమ్ 33 పరుగులతో పాక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.