సచిన్ టెండూల్కర్.. భారత క్రికెట్‌లో ఒక సంచలనం. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలను సాధించిన ఏకైక క్రికెటర్. టెస్టుల్లో 51 శతాకాలు సాధించిన సచిన్.. వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు. అయితే తొలి సెంచరీ సాధించడానికి ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్ 1990లో మొదటి టెస్టు సెంచరీ, 1994 తొలి వన్డే సెంచరీ సాధించాడు. తన శకంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుల కొల్లగొడుతూ పరుగుల మోతమోగించాడు. సచిన్ తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. 200 టెస్టుల్లో 15, 921 పరుగులు సాధించగా, 463 వన్డేల్లో 18,426 పరుగులు నమోదు చేశాడు. ఇక ఏకైక అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ సచిన్ ఆడాడు. తమ శకంలో సచిన్ ఒక అసాధారణ క్రికెటర్ అంటూ పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ ఇంజమాముల్ హక్ ప్రశంసించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్‌లో సచిన్ గురించి పలు విషయాలను ఇంజమామ్ వెల్లడించాడు.
అసలు సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును, పరుగుల రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలని ఉందన్నాడు. ‘ సచిన్ క్రికెట్ కోసమే పుట్టాడు. క్రికెట్-సచిన్‌లు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లే ఉంటుంది. 16-17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి దిగ్గజ బౌలర్లను సైతం సచిన్ వణికించాడు. కేవలం అతనికి మాత్రమే సాధ్యమైన రికార్డులతో క్రికెట్‌కు వన్నెతెచ్చాడు. మా టైమ్‌లో అసాధారణం అనేది ఏదైనా ఉందంటే అది సచిన్. ఎంతో మంది దిగ్గజ బౌలర్లకు సచిన్ దడపుట్టించాడు. వకార్ యూనస్, వసీం అక్రమ్ వంటి బౌలర్లకు సచిన్ తన 16 ఏళ్ల వయసులోనే చుక్కలు చూపించాడు. పేస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ఎటాక్ చేసేవాడు. అదే సమయంలో రికార్డుల మోత మోగించాడు.
ఆ శకంలో పరుగులు చేయడమంటే అంత ఈజీ కాదు. అప్పటివరకూ సాధారణంగా మొత్తమన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల లోపు పరుగులు చేస్తేనే అదొక గొప్ప విషయం. సునీల్ గావస్కర్ సాధించిన 10వేల పరుగులే అప్పట్లో గొప్ప. ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అనుకోలేదు. కానీ సచిన్ వరుసగా అన్ని రికార్డులను కొల్లగొట్టుకుంటూ పోయాడు. మరి సచిన్‌కే అది సాధ్యమైందంటే క్రికెట్ దేవుడే కదా. ఇక ఇప్పుడు సచిన్ రికార్డులను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలని ఉంది’ అని ఇంజమామ్ తెలిపాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే సచిన్ లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, మీడియం పేస్ బౌలింగ్ వేస్తూ ఉండేవాడు. మూడు రకాలుగా బౌలింగ్ వేయడంలో మంచి నైపుణ్యాన్ని సచిన్ ప్రదర్శించేవాడు. భారత్ బౌలింగ్‌లో సచిన్ వేసే గుగ్లీలే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టేవి. అతనికే చాలా సార్లు ఔటయ్యాను కూడా’ అని సచిన్ బౌలింగ్ గురించి ఇంజీ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment