
ఆంటిగ్వా: భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించడమే తన ముందున్న లక్ష్యమని తెలుగుతేజం హనుమ విహారి స్పష్టం చేశాడు. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విహారి 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. రహానేతో కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఈ నేపథ్యంలో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు విహారి. అయితే స్వతహాగా ఆఫ్ స్పిన్నర్ అయిన విహారి ఇక బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి సారించాలని అన్నాడు. ‘ నా ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. బౌలింగ్‌లో ఆడపదడపా బౌలింగ్ కాకుండా రెగ్యులర్ బౌలింగ్ ఆప్షన్ కావాలి. అదే నా లక్ష్యం. టీమిండియా క్రికెట్ జట్టులో ఐదో బౌలింగ్ ఆప్షన్‌గా స్థిరపడాలనుకుంటున్నా. ఐదో బౌలింగ్ ఆప్షన్‌లో నేను ఫిట్ కావాలనుకుంటున్నా. అయితే నా బౌలింగ్‌కు బాగా పదును పెట్టాల్సి ఉంది. నేను సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు వేస్తే అది జట్టుకు ఉపయోగపడాలనేది కోరిక. అందుకోసం నా ఆఫ్ స్పిన్‌లో రాటుదేలాలి. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లు ఎందరో ఉన్నారు. వారి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా నా అదృష్టంగా భావిస్తా’ అని విహారి పేర్కొన్నాడు.( ఇక్కడ చదవండి: భారత్ ఘన విజయం)
Comments
Please login to add a commentAdd a comment