ఇస్లామాబాద్ : ప్రపంచకప్ టోర్నీలో లీగ్ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించడాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే తమ దేశ ఆటగాళ్ల తీరు, ప్రదర్శనపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా పాక్ మాజీ సారథి వకార్ యూనిస్ పలువురు సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూనే మరోవైపు బోర్డు నిర్ణయాలపై నిప్పులు చెరిగాడు. కొందరు సీనియర్ ఆటగాళ్లు వారి స్వార్థం కోసం ఇంకా క్రికెట్ ఆడుతున్నారని విమర్శించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బోర్డు ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కావటం లేదని మండిపడ్డాడు.
‘ప్రపంచకప్‌లో పాక్ ఓటమికి ప్రధాన కారణం మెరుగైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం. ఫిట్‌నెస్, ఫామ్, ఇతర విషయాల్లో రాజీ పడటం సెలక్టర్లు చేసే పెద్ద పొరపాటు. తాజాగా ప్రపంచకప్‌కు పాక్ జట్టు ఎంపికే గందరగోళంగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడాలనే కోరికతో కొందరు సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి అర్హత లేకున్నా రాజకీయాలు చేసి జట్టులో చోటు దక్కించుకున్నారు. వాళ్లను వాళ్లు మోసం చేసుకోవడమే కాదు పాక్ క్రికెట్ జట్టును నాశనం చేశారు. ఇప్పటివరకు మీరు ఆడింది చాలు వెళ్లిపోతే మంచిది.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఓడిపోయిన ప్రతీసారి పాక్ క్రికెట్ బోర్డు ఒకే ఫార్ములాను పాటిస్తుంది. కోచింగ్ బృందాన్ని, సెలక్టర్లను మార్చుతుంది. అంతేకానీ దేశవాళీ క్రికెట్‌లో మార్పులు తీసుకరావడం, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలనే కనీస ఆలోచన చేయదు. బోర్డు ఆలోచన మారనంత వరకు.. ప్రపంచకప్‌లో పాక్ ప్రదర్శన మారదు. అవసరమనుకుంటే సీనియర్ ఆటగాళ్ల సూచనలను తీసుకుని పాక్ క్రికెట్‌ను బతికించండి’అంటూ వకార్ యూనిస్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment