
స్మిత్, వార్నర్
లండన్: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్‌లపై ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రే ఆసక్తి కనబరుస్తోంది. సర్రే హెడ్ కోచ్ మైకేల్ డి వెనుటో వాళ్లిద్దరిని ఆడించాలని ఆశిస్తున్నారు. ఆయన 2013 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. అయితే వీళ్లిద్దరు కౌంటీల్లో ఆడాలంటే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆమోదం తప్పనిసరి. డి వెనుటో మాట్లాడుతూ... ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీల్లోనే వాళ్లపై నిషేధం విధించిందని, ఆసీస్‌లో క్లబ్, ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడేందుకు అవకాశముందని చెప్పారు.
‘స్మిత్, వార్నర్‌లకు ఆడాలని ఉంటే కౌంటీల్లో ఆడించవచ్చు. ఈసీబీ కూడా అనుమతించవచ్చు. అలా కాకుండా... ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లయిన వారిని నిరోధించడం తలతిక్క పనే అవుతుంది’ అని ఆయన అన్నారు.