
కరాచీ: తమ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ లో పాల్గొనేలా భారత్ ను ఒప్పించడంలో విఫలమవుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)పై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అసలు బీసీసీఐని శాసించే సత్తా ఐసీసీకి లేదనడానికి ఇదే ఉదాహరణగా అక్రమ్ విమర్శించాడు. 'ఇరు దేశాల ఆటగాళ్లు పరస్పరం తలపడటం ఎంతో ముఖ్యం. క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి.బీసీసీఐని ఐసీసీ ఒప్పించడంలో విఫలమవుతుంది. బీసీసీఐని అనునయించే సత్తా ఐసీసీకి ఉందని అనుకోవడం లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును శాసించే సత్తా ఐసీసీకి లేదనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది' అని అక్రమ్ మండిపడ్డాడు.
ఇక్కడ భారత్ కు ఇష్టం లేకపోతే పాకిస్తాన్ ఎటువంటి బలవంతం చేయకుండా ఉంటేనే మంచిదన్నాడు. ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కంటే భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే సిరీస్ లకే ఎక్కువ ఆదరణ లభిస్తుందనేది కాదనలేని సత్యమని అక్రమ్ తెలిపాడు. రాజకీయాలకు అతీతంగా క్రీడల్ని చూసినప్పుడే ఇరు దేశాల మధ్య సిరీస్ లు జరుగుతాయన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment