పాక్ సూపర్ లీగ్ ఐపీఎల్లా అలరిస్తుందా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తర్వరలో ప్రారంభించనున్న పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పోటీలు హిట్ అవుతాయా! ఆసియాలోని క్రికెట్ అభిమానులందరిలో ఇదే సందేహం. క్రికెట్ను వెర్రిగా ప్రేమించే దక్షిణాసియా దేశాల్లో భారత్ తర్వాత ఎక్కువ మంది అభిమానులున్నది పాకిస్థాన్కే. ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్న ఇస్లామిక్ దేశాల్లోనూ క్రికెట్కు మంచి ఆదరణ ఉంది.
అందుకు తగ్గట్లే అభిమానులకు మజాను అందించడంతోపాటు కాస్తంత సొమ్ము కూడా చేసుకుందామనే భావనతో పొట్టి క్రికెట్ పోటీలను తెరపైకి తెచ్చింది పీసీబీ. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు అంటే.. 24వ తేదీ వరకు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి.
ఇక ఈ టోర్నీకి ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు)గా మాజీ క్రికెటర్లు వసీం అక్రం, రమీజ్ రాజాలు నియమితులయ్యారు. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మంగళవారం వీరి నియామకాలను ఖరారుచేశారు. దీంతో వసీం, రమీజ్లు ఐపీఎల్కు దూరం కానున్నారనే వార్తలూ వినవస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్గా వసీం అక్రం.. వ్యాఖ్యత, విశ్లేషకుడిగా రమీజ్లు ఐపీఎల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.