
'సర్ఫరాజ్ బ్యాటింగ్ సూపర్'
బెంగళూరు: భారత యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ పై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాటింగ్ స్టయిల్ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. అతడు ఆడే షాట్లపై కంట్రోల్ బాగుందని పేర్కొన్నాడు.
'అతడో అద్భుతమైన యువకుడు. అన్నిరకాల షాట్లు ఆడేందుకు అతడు ఎంతో ప్రాక్టీస్ చేసినట్టు అర్థమవుతోంది. తాను ఆడే షాట్లపై నియంత్రణ బాగుంది. ఇలాంటి యంగ్ టాలెంట్ ను ఇంతకుముందెన్నడూ చూడలేదు. బాగా బ్యాటింగ్ చేసేందుకు అతడు చాలా ప్రాక్టీస్ చేస్తాడు. అది ఈ రోజు మ్యాచ్ లో ప్రస్ఫుటమైంది. ఒక్క చెత్త షాట్ కూడా ఆడలేదు. బ్యాక్ ఫుట్ మీద అతడు కొట్టిన సిక్సర్ అద్భుతమైన షాట్. ఎంతో సులువుగా బాదిన ఈ షాట్ ను చూసి తీరాల్సిందే. సర్ఫరాజ్ షాట్ సెలెక్షన్ చాలా బాగుంద'ని వాట్సన్ అన్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు బాదాడు. సర్ఫరాజ్ చెలరేగడంతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది.