టాప్ గేర్‌లో ఉన్నా.. అలర్ట్‌గానే ఆడుతాం: ధోనీ
కోల్‌కతా: వరుసగా భారీ విజయాలు.. దీనికితోడు సొంత గడ్డపై ఆడుతుండటం.. టీ-20 ప్రపంచ కప్ లో ధోనీ సేనకు కలిసొచ్చే అంశం. అయితే, ట్వంటీ-20 అనేది చాలా అనిశ్చితి కూడుకున్న ఫార్మెట్. ఏ రోజు ఎవరు గెలుస్తారో ముందే చెప్పడం చాలా కష్టం. అందుకే రానున్న టీ-20 వరల్‌కప్‌ను తాము అంతగా ఈజీగా తీసుకోవడం లేదని, తొలి బంతి నుంచే ఫోకస్ పెట్టి ఆడేందుకు ప్రయత్నిస్తున్నామని టీమిండియా మహేంద్రసింగ్ ధోనీ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డ మీదనే ఓడించడం, శ్రీలంకను, బంగ్లాదేశ్ ను చిత్తుచేసి ఆసియా కప్‌ను సాధించడంతో ధోనీ సేన మాంఛి ఊపు మీద ఉంది. ఆసియా కప్‌ను ఘన విజయంతో ముగించి.. టాప్ గేర్‌లో వరల్డ్ కప్ లోకి ఎంటరవుతున్నది. ఈ నేపథ్యంలో హోమ్ టీమ్ ఫేవరెట్ అని పరిశీలకులు కూడా స్పష్టం చేస్తున్నారు. టీమిండియా మరోసారి పొట్టి వరల్డ్ కప్‌ను గెలుచుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఈ అంచనాలు తమలో ఉత్సాహాన్ని పెంచుతున్నప్పటికీ సీరియస్‌గానే తాము టీ-20 వరల్డ్ కప్‌లోకి ఎంటరవుతున్నట్టు ధోనీ స్పష్టం చేశాడు. 'ప్రస్తుతం మేం సిక్స్త్ గేర్‌లో దూసుకుపోతున్నాం. టెక్నాలజీ మాత్రం ఎనిమిదో గేర్ వరకు అభివృద్ధి చెందింది. అయితే, ఏ లెవల్ గేమ్ కైనా మేమున్న ఫామ్ సరిగ్గా సరిపోతుంది. మొదటి బంతి నుంచే మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం అంతా సిద్ధమైంది. ఇంకా గేర్ల ప్రసక్తే అవసరం లేదు. ఇక ఆడటమే తరువాయి. అందుకు సర్వసన్నద్ధంగా జట్టు ఉండటం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది' అని ధోనీ మంగళవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
టీ-20 వరల్డ్ కప్‌లో టీమిండియా తన ప్రస్తానాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనుంది. తొలి మ్యాచులో న్యూజిల్యాండ్‌ను ధోనీ సేన ఎదుర్కొంటుంది. యువద్వయం జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా జట్టు అంచనాలకు తగ్గట్టు రాణిస్తుండటం, వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా జట్టు సమర్థంగా ఉపయోగపడుతుండటం చాలా ఆనందం కలిగిస్తోందని, తమ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ చాలా బాగా ఆడుతోందని ధోనీ చెప్పాడు.