ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం
ఫిఫా వరల్డ్ కప్ సాధించడానికి తాము ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెబుతున్నాడు అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ లియోనెల్ మెస్సీ. సెమీఫైనల్ మ్యాచ్లో తాము నెదర్లాండ్స్ జట్టుపై పెనాల్టీ షూటవుట్లో 4-2 తేడాతో గెలిచిన విజయాన్ని అదేరోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన స్పోర్ట్స్ జర్నలిస్టు జార్జి టోపో లోపెజ్కు మెస్సీ అంకితమిచ్చాడు.
''అర్జెంటీనా టీమ్లో సభ్యుడినైనందుకు చాలా గర్వంగా ఉంది, అద్భుతమైన ఆట ఆడారు. ఎలాగైతే మనమంతా కలిసి ఫైనల్లోకి వెళ్లిపోయాం. దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. మనం కేవలం ఒక్క చిన్న అడుగు దూరంలోనే ఉన్నాం'' అని తన ఫేస్బుక్ పేజీలో మెస్సీ పోస్ట్ చేశాడు. ఇక జర్నలిస్టు లోపెజ్ బుధవారం నాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత కారులో హోటల్కు వెళ్తుండగా, పోలీసుల నుంచి పారిపోతున్న దొంగల కారు ఈయనను ఢీకొనడంతో మరణించారు. ఆయనకు మెస్సీ ఘనంగా నివాళులు అర్పించాడు.
ఇక అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా కూడా ఫైనల్ మ్యాచ్కి ముందు జట్టుతోపాటే వాళ్లు ఉంటున్న హోటల్లోనే ఉంటానని చెప్పాడు. దీనివల్ల తమ జట్టుకు నైతిక బలం వస్తుందని, అలాగే వ్యూహాల విషయంలో కూడా కాస్త ముందంజలో ఉండే అవకాశం ఉంటుందని మారడోనా భావిస్తున్నట్లు సమాచారం.