న్యూఢిల్లీ:ఈ ఏడాది ఆగస్టులో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ నుంచి రెండు పతకాలు గెలిచే అవకాశం ఉందని బాయ్ (బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు.' 2016 ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ విభాగం నుంచి రెండు పతకాలు వస్తాయని ఆశిస్తున్నాం. గత ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ లో ఒక పతకమే వచ్చింది. ఈసారి అది రెండుకు చేరుతుందని అనుకుంటున్నాం. అందులో ఒక స్వర్ణ పతకం కూడా ఉండవచ్చు'అని ఆయన తెలిపారు.
గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో సైనా నెహ్వాల్, పివి సింధులు ఆశించిన స్థాయిలో రాణిస్తుండటంతో ఒలింపిక్స్ పతకాలు ఖాయం కనబడుతోందన్నారు. ఇక పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ తో పాటు, ప్రణోయ్ కూడా ఫామ్లో ఉండటం కూడా కలిసొచ్చే అవకాశం ఉందని అఖిలేష్ దాస్ గుప్తా అన్నారు.