సాక్షి, రాంచీ: డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ఏమిటో ఇప్పటికి అర్థం కావట్లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 9 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం కలిసొచ్చింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ఏంటో ఇప్పటికి అర్థం కావడం లేదు. ఆసీస్‌ను 118కే కట్టడి చేశాం. మా టార్గెట్ 40కి అటు ఇటుగా ఉంటుందనుకున్నాము. కానీ గమ్మత్తుగా 48 అయింది. ఈ గెలుపు ఆటగాళ్ల సమిష్టి కృషి. మేనేజ్‌మెంట్ సాయం మరవలేనిది. ఫార్మట్‌కు దగ్గట్టు ఆటగాళ్లను ఎంపిక చేయడం. ముఖ్యంగా యువ స్పిన్నర్ల ఎంపిక ధైర్యాన్నిచ్చింది. ఒక మ్యాచ్‌లో పరుగులిచ్చినా, వారు తిరిగి విజృంభించారు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌లో భువనేశ్వర్, బుమ్రాలు బ్రిలియంట్ బౌలర్లు. యార్కర్లు, స్లో బంతుల వేసినపుడే బౌలర్ల నైపుణ్యం తెలుస్తోంది. ఈ విషయంలో ఈ పేస్ బౌలర్లు విజయవంతమయ్యారు.’ అని కోహ్లి తెలిపారు. ఇక శిఖర్ ధావన్ పునరాగమనంపై హర్షం వ్యక్తం చేసిన కోహ్లి.. దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్‌లకు ధావన్ దూరమయ్యాడు. జట్టులోకి రావడం.. ఈ ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేయండం ధైర్యాన్నిచ్చిందని కోహ్లి పేర్కొన్నారు.
ఆసీస్18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగుల వద్ద వర్షంతో ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల అంతరాయం తర్వాత భారత్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన భారత్ 5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (14 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా డక్‌వర్త్ లూయిస్ మాకే కాదు.. ఐసీసీకి కూడా అర్థం కాదని గతంలో వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment