
ముంబై: కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేనందున ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు గొప్ప అవకాశం వచ్చిందని మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తాను నెలకొల్పిన ‘టెండూల్కర్–మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ ప్రారంభం సందర్భంగా గురువారం సచిన్ మీడియాతో మాట్లాడాడు. స్మిత్, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేత గురించి స్పందించేందుకు అతడు నిరాకరించాడు. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఆకట్టుకుంటున్నాడని, భారత పేస్ బౌలింగ్‌లో బుమ్రా కీలకమని పేర్కొన్న సచిన్... ఇలాంటి ఆరోగ్యకర పోటీ ఆహ్వానించదగినదని అన్నాడు.
ఒక క్రికెటర్‌గా విరాట్ కోహ్లి పురోగతి అద్వితీయమని, అతడిలో ఆ కసిని తాను చూశానని పేర్కొన్నాడు. ‘విరాట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలుస్తాడని నేను అంచనా వేశా. అతడు ఆల్‌టైమ్ గ్రేట్‌గా అవతరిస్తాడు. ఇక్కడ బౌలర్ల స్థాయి ఏమిటనేది అప్రస్తుతం. తరానికి తరానికి మార్పు తప్పనిసరిగా ఉంటుంది. అందుకని పోల్చి చూడటాన్ని నేను నమ్మను. యువ ఆటగాడు పృథ్వీ షా మరింతగా వెలుగులోకి వచ్చేందుకు ఆస్ట్రేలియా పర్యటన ఉపయోగపడుతుంది’ అని సచిన్ విశ్లేషించాడు.