మరో విజయం కావాలి
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో ఈ సారైనా గ్రూప్ ‘సి’నుంచి పైకి రావాలని పట్టుదలగా ఉన్న హైదరాబాద్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేటినుంచి జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, అస్సాంతో తలపడుతుంది. గత మ్యాచ్‌లో త్రిపురను ఓడించిన రవితేజ సేన కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లనూ డ్రా చేసుకున్న హైదరాబాద్, ఈ మ్యాచ్‌లోనైనా గెలిస్తే పాయింట్ల పట్టికలో దూసుకెళుతుంది.
తద్వారా జట్టు ప్రమోట్ అయ్యే అవకాశాలు మెరుగు పడతాయి. ప్రస్తుతం ఐదు మ్యా చ్‌ల్లో ఒక విజయం, నాలుగు డ్రాలతో హైదరాబాద్ 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. మరో వైపు అస్సాం నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒకటి ఓడి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఫామ్‌లో బ్యాట్స్‌మెన్
హైదరాబాద్ జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడారు. వీరిలో విహారి (445 పరుగులు), అక్షత్ రెడ్డి (389), రవితేజ (262), ఆశిష్ రెడ్డి (251) మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా విహారి 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో చెలరేగాడు. నాలుగు మ్యాచ్‌లే ఆడిన తన్మయ్ అగర్వాల్ (373) కూడా చక్కటి ఆటతీరు కనబర్చాడు. అక్షత్, తన్మయ్‌లు కూడా రెండేసి శతకాలు బాదారు.
ఈ నేపథ్యంలో వీరంతా మరో సారి ఇదే ప్రదర్శనను కొనసాగించాల్సి ఉంది. వీరితో పాటు అహ్మద్ ఖాద్రీ, ఇబ్రహీం ఖలీల్ కూడా రాణిస్తే హైదరాబాద్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. బౌలర్లలో అన్ని మ్యాచ్‌లు ఆడిన రవికిరణ్ (13 వికెట్లు)తో పాటు మిలింద్ (13), భండారి (11) నిలకడగా రాణిస్తున్నారు. గత మ్యాచ్‌లో త్రిపురను కుప్పకూల్చిన అన్వర్ ఖాన్ ఉప్పల్‌లోనూ కీలకం కానున్నాడు. ఇక్కడ గోవా, సర్వీసెస్‌లతో జరిగిన మ్యాచ్‌లలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్, ఈ సారి సొంత మైదానం అనుకూలతను ఉపయోగించుకొని గెలుస్తుందా లేదా చూడాలి.
పోటీ ఇవ్వగలదా..?
మరో వైపు అస్సాం ఈ సీజన్‌లో గతంలోకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అద్భుతంగా ఆడకపోయినా, ఆ జట్టు ఆటతీరు మరీ ఘోరం గా ఏమీ లేదు. హైదరాబాద్‌తో పోలిస్తే రెండు మ్యాచ్‌లలో అస్సాం విజయాన్ని అందుకుంది. త్రిపురపై బోనస్ పాయింట్‌తో సహా గెలిచిన ఆ జట్టు, సర్వీసెస్‌ను కూడా ఓడించింది. అయితే హిమాచల్‌ప్రదేశ్ చేతిలో చిత్తుగా ఓడింది.
టీం తరఫున ఒక్కరూ సెంచరీ సాధించకపోయినా వారంతా సమష్టి ఆటతీరు కనబర్చారు. నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి శివ్‌శంకర్ రాయ్ (240 పరుగులు) అత్యధిక పరుగులు చేయగా, తర్జీందర్ సింగ్ (189), పల్లవ్ దాస్ (185), అరుణ్ కార్తీక్ (166) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో పేసర్ కృష్ణ దాస్ చెలరేగిపోతున్నాడు. కేవలం 17.65 సగటుతో 20 వికెట్లు తీసిన కృష్ణ, అస్సాం తరఫున కీలకం కానున్నాడు. ఇతరత్రా బౌలింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. కాబట్టి హైదరాబాద్ తమ బ్యాటింగ్ బలంతోనే ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంది.
జట్ల వివరాలు
హైదరాబాద్: డీబీ రవితేజ (కెప్టెన్), ఖాద్రీ, అక్షత్ రెడ్డి, తన్మయ్, విహారి, ఖలీల్, ఆశిష్ రెడ్డి, బి. సందీప్, భండారి, మిలింద్, రవికిరణ్, డెరెక్ ప్రిన్స్, మెహదీ హసన్, హర్ష, అన్వర్ ఖాన్.
అస్సాం: ధీరజ్ జాదవ్ (కెప్టెన్), అరుణ్ కార్తీక్, అరూప్ దాస్, పల్లవ్ దాస్, కొన్వర్, శివ్‌శంకర్ రాయ్, గోకుల్ శర్మ, తర్జీందర్, అబూ నెచిమ్, పర్వేజ్ అజీజ్, కృష్ణదాస్, ధీరజ్ గోస్వామి, స్వరూపమ్, కునాల్ సైకియా, సయ్యద్ మొహమ్మద్