
ఢీ అంటే ఢీ!
♦ ఆసీస్‌తో ఇలాగే తలపడాలి
♦ పోరుకు సిద్ధమన్న రోహిత్ శర్మ
పెర్త్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడైనా హోరాహోరీ తప్పదని... ఈసారి కూడా అదే విధంగా సిరీస్ కొనసాగే అవకాశం ఉందని భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గతేడాదిలో ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో తాము గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ‘ఆస్ట్రేలియా జట్టు అంత సులువుగా ప్రత్యర్థి ముందు తలవంచదు. వారిపై బాగా ఆడి గెలవడం ఒక పరీక్షలాంటిదే. ప్రతీ పరుగు కోసం పోరాడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సవాళ్లను నేను ఇష్టపడతాను. ఇక్కడ రాణిస్తే వచ్చే గుర్తింపు వేరు. నేను కూడా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను’ అని రోహిత్ చెప్పాడు. వన్డే సిరీస్‌కు వారం రోజులు ముందు రావడం వల్ల ఇక్కడ పరిస్థితులపై తమకు అంచనా ఏర్పడుతుందని, ముఖ్యంగా తొలి వన్డే జరిగే పెర్త్ పిచ్‌పై తమకు పూర్తి అవగాహన ఉందని అతను చెప్పాడు.
ఇక్కడా భారత అభిమానులే: వేడ్
ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్‌లలో కూడా తమకంటే భారత ఆటగాళ్లకే ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా ఉం డటం కాస్త ఒత్తిడి పెంచే అంశమని ఆసీస్ వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్ అభిప్రాయపడ్డాడు. ‘భారీ సంఖ్యలో ఉండే ప్రేక్షకుల మధ్యలో మ్యాచ్ ఆడటం ఉత్సాహాన్నిస్తుంది. అయితే ఇక్కడ కూడా మాకంటే భారత అభిమానులే ఎక్కువగా మ్యాచ్‌కు వచ్చి వారికి అండగా నిలుస్తున్నారు’ అని వేడ్ అన్నాడు.
మరోవైపు ఇరు జట్లూ దూకుడైన క్రికెట్‌కు మారుపేరని... కాబట్టి సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కారణాలతో విశ్రాంతికి అవకాశం ఉన్నా... భారత్‌తో పోరుకు దూరం కాకూడదని స్మిత్, వార్నర్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు కోచ్ వెల్లడించారు.