ప్రయోగాలు చేయం | We will not experiment in the series against New Zealand: Mahendra Singh Dhoni | Sakshi
Sakshi News home page

ప్రయోగాలు చేయం

Published Sun, Jan 19 2014 1:12 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

ప్రయోగాలు చేయం - Sakshi

ప్రయోగాలు చేయం

ఉదయం గం. 6.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్ పర్యటనలో ప్రయోగాలు చేసేందుకు భారత కెప్టెన్ ధోని ఆసక్తి కనబర్చడం లేదు. వీలైనంతగా ఈ టూర్ నుంచి యువకులు మంచి అనుభవాన్ని సంపాదించాలని మాత్రం కోరుకుంటున్నాడు. రాబోయే వరల్డ్‌కప్ ఆసీస్, కివీస్ గడ్డపై జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లు కుదురుకుంటే ఇక ఢోకా ఉండదని భావిస్తున్నాడు. నేటి నుంచి జరగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై ధోని మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడాడు.
 
  నేపియర్: బ్యాటింగ్‌లో నాలుగో నంబర్‌లో ఎవరు ఆడతారనే అంశంపై ఇంకా ఆలోచించలేదని ధోని చెప్పాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నాడు.
 
 
  ఆసీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన రైనాను ఈ స్థానానికి ప్రమోట్ చేయడంపై కెప్టెన్ ఎలాంటి స్పందన కనబర్చలేదు. ‘ఏది మంచి అనుకుంటే ఆ దిశగా ముందుకెళ్తాం. చాపెల్ శకం తర్వాత మేం పెద్దగా ప్రయోగాలు చేయడం లేదు. అవకాశం ఇచ్చిన కొంత మంది ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకున్నారు. సవాళ్లనూ అధిగమించారు’ అని ధోని వ్యాఖ్యానించాడు.
 
   గాలివాటం కీలకం
 కివీస్‌లో గాలివాటం కీలక పాత్ర పోషిస్తుంది. బంతి దిశపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. జట్టులోకి వచ్చిన కొత్త బౌలర్లకు ఇక్కడ ఆడిన అనుభవం కావాలి. 2015 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికలపై ఆడిన అనుభవం మా జట్టులోకి ఇద్దరు, ముగ్గురికే ఉంది. ఏదేమైనా ఈ టూర్ మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.
 
  డ్రాపింగ్ పిచ్ కాదు...
 తొలి వన్డే జరిగే మెక్లీన్ పార్క్‌లో ఉన్నది డ్రాపింగ్ పిచ్ కాదు. రగ్బీ సీజన్ లేకపోవడంతో షెడ్యూల్ కంటే ముందే వికెట్‌ను సిద్ధం చేశారు. కాబట్టి వన్డేలకు సరిపోయే విధంగా ఉంది. వికెట్ పొడిగా, కఠినంగా ఉంది. పేసర్లకు ఎక్స్‌ట్రా బౌన్స్ లభిస్తుంది.
 
   ‘పేస్’తో కొడతాం: మెకల్లమ్
 తొలి వన్డేలో భారత్‌ను పేస్‌తో దెబ్బతీస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ హెచ్చరించాడు. ఐదుగురు పేసర్లతో తమ సత్తా ఏంటో రుచి చూపిస్తామని చెప్పాడు. ‘మా పేసర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి వన్డేలోనే పేస్‌తో అటాక్ చేసి ఫలితాన్ని సాధిస్తాం.
 
  మా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్ దెబ్బతీసినా ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. కొత్త బంతితో మిల్స్, సౌతీ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. మొత్తానికి మా పేస్ అటాక్ మంచి దూకుడు మీదుంది’ అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు. భారత బౌలింగ్‌ను బట్టి తమ బ్యాటింగ్ తీరు ఉంటుందన్నాడు. స్లో, టర్నింగ్ ట్రాక్‌లపై ఎక్కువగా ఆడే ధోనిసేనకు ఇక్కడి వికెట్లపై ఇబ్బందులు తప్పవన్నాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement