డాకా: పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లమని ఏ ఒక్క ఆటగాడ్నీ తాము బలవంతం చేయడం లేదని తాజాగా బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. పాకిస్తాన్ పర్యటనకు ఇష్టమైతేనే వెళ్లమంటూ ఆయన స్పష్టం చేశారు. ఇందులో కచ్చితంగా వెళ్లమని ఎవర్నీ బలవంతం చేయబోమన్నాడు. త్వరలో పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ పర్యటించనున్న నేపథ్యంలో నజ్ముల్ హసన్ స్పందించారు. ‘ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లమని మా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరికి వారు ఇష్టముంటే వెళ్లవచ్చు.
అక్కడ భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఒకవేళ పాక్‌కు వెళ్లకూడదని అనుకుంటే వెళ్లవద్దు. ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ను రిప్లేస్ చేయడం కష్టం. అప్పటి పరిస్థితుల్ని బట్టి పాక్ పర్యటనకు వెళ్లే జట్టు ఎంపిక ఉంటుంది’ అని నజ్ముల్ హసన్ తెలిపారు. గతంలో పాకిస్తాన్ పర్యటనకు తమ మహిళల క్రికెట్ జట్టుతో పాటు పురుషుల జట్టు కూడా వెళ్లిందనే విషయానం‍్ని నజ్ముల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాకపోతే అప్పుడు సెక్యూరిటీ పరమైన హామీ లభించిన తర్వాతే అక్కడకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకా భద్రతా పరమైన హామీ ఇంకా లభించలేదని, దీనిపై త్వరలో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment