దుబాయ్: టీమిండియాతో హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీవీ అంపైర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లాపై ఐసీసీ రెండు వన్డేల నిషేధం విధించింది. 100 శాతం జరిమానా, మూడు డీమెరిట్ పాయింట్లు విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం 24 నెలల్లోనే స్టువర్ట్ లా డీమెరిట్ పాయింట్లు నాలుగుకు చేరడంతో ఆయనపై రెండు వన్డేల నిషేధం విధించిక తప్పలేదు. దీంతో భారత్‌తో గువాహటి, విశాఖలో జరిగే వన్డేలకు ఆయన అందుబాటులో ఉండడు.
భారత్‌తో రెండో టెస్టు మూడో రోజు ఆటలో విండీస్ ఆటగాడు కీరన్ పావెల్ ఔటైన వెంటనే స్టువర్ట్ లా టీవీ అంపైర్ గదిలోకి వెళ్లి దుర్భాషలాడాడు. ఆ తర్వాత నాలుగో అంపైర్ వద్దకు వెళ్లి ఆటగాళ్ల ముందరే ఇబ్బందికరంగా మాట్లాడాడు. అంపైరు ఆయనపై రిఫరీకి ఫిర్యాదు చేశారు. సోమవారం స్టువర్ట్ తన తప్పును అంగీకరించడంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానల్ సభ్యుడు క్రిస్‌బ్రాడ్ అతనిపై నిషేధం విధించారు. 2017, మేలో పాకిస్తాన్‌తో జరిగిన డొమినికా టెస్టు చివరి రోజు స్టువర్ట్ ఇలాగే నిబంధనలు ఉల్లంఘించడంతో 25 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. విండీస్‌పై భారత్ 2-0తో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment