Stuart Law
-
34 ఏళ్ల నిరీక్షణకు తెర.. బంగ్లాదేశ్ రియల్ హీరో అతడే
అండర్-19 ఆసియాకప్ 2023లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 160 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. తొలిసారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. సీనియర్ జట్టుకు కూడా సాధ్యం కానిది జూనియర్ బంగ్లా టైగర్స్ చేసి చూపించారు. దీంతో తమ 34 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. 1989 నుంచి ఆసియాకప్ టైటిల్ కోసం పోరాడతున్న బంగ్లా అండర్-19 జట్టు ఎట్టకేలకు సాధించింది. కాగా సెమీస్‌లో భారత్ వంటి పటిష్ట జట్టును ఓడించి మరి బంగ్లాదేశ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అతడే రియల్ హీరో.. బంగ్లాదేశ్ తొలిసారి అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు హెడ్ కోచ్ స్టువర్ట్ లాది కీలక పాత్ర. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా గతేడాది జూలైలో బంగ్లా అండర్-19 జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లా యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. అతడి నేతృత్వంతో యువ క్రికెటర్లు మరింత రాటుదేలారు. ఆసియాకప్ టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ బంగ్లా యువ జట్టు అదరగొట్టింది. కాగా గతంలో బంగ్లా సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌గా స్టువర్ట్ లా పనిచేశారు. 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు బంగ్లా ప్రధాన కోచ్‌గా లా కొనసాగారు. అతడి పర్యవేక్షణలో తమీమ్ ఇక్భాల్, ముష్ఫికర్ రహీం వంటి వారు వరల్డ్‌క్లాస్ క్రికెటర్లగా ఎదిగారు. అదే విధంగా అతడు శ్రీలంక, వెస్టిండీస్ జట్ల హెడ్‌కోచ్‌గా కొనసాగారు. ఇక అతడి నేతృత్వంలోని బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. వీరే ఫ్యూచర్ స్టార్స్.. ఈ ఆసియాకప్ టోర్నీతో బంగ్లా జట్టుకు అషికర్ రెహ్మాన్ షిబ్లీ రూపంలో యువ సంచలనం దొరికాడు. ఈ టోర్నీ ఆసాంతం అషికర్ రెహ్మాన్ ఓపెనర్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షిబ్లీ... 255 పరుగులతో టోర్నీ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈతో జరిగిన ఫైనల్లో కూడా షిబ్లీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, అరిఫుల్ ఇస్లాం కూడా సంచలన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వీరిముగ్గురూ అతి త్వరలోనే బంగ్లా జాతీయ జట్టులో కన్పించనున్నారు. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది? -
‘మూడు వన్డేల తర్వాత పెట్రోల్ అయిపోయింది’
తిరువనంతపురం: భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా పేర్కొన్నాడు. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన తమ జట్టు.. బలమైన భారత్‌కు వారి దేశంలోనే గట్టిపోటీ ఇచ్చిందన్నాడు. ఈ విషయం తొలి మూడు వన్డేలను చూస్తే అర్ధమవుతుందన్నాడు. కాగా, తొలి మూడు వన్డేల తర్వాత చివరి రెండు వన్డేల్లో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందడంపై స్టువర్ట్‌లా చమత్కరించాడు. మూడు వన్డేలకే తమ ఆటగాళ్లలో పెట్రోల్ అయిపోయిందని సెటైర్ వేశాడు. ‘మా కుర్రాళ్లు తెలివైన వారు. నైపుణ్యం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అనుభవం వారికి రావాలి. నలభైవేల మంది అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే అత్యుత్తమ జట్టుతో తలపడడం అంత సులువు కాదు. ఆ పరిస్థితులను అనుభవిస్తే అలవాటవుతుంది. గెలవాలంటే నైపుణ్యం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మూడు వన్డేల తర్వాత మా జట్టు వైఫల్యం చెందడానికి కారణం ఆటగాళ్లలో తగినంత అనుభవం లేకపోవడమే’ అని స్టువర్ట్ లా పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక్కడ చదవండి: ముగింపు అదిరింది ధోని భాయ్ అది పక్కా ఔట్! -
వెస్టిండీస్ కోచ్‌పై ఐసీసీ నిషేధం
దుబాయ్: టీమిండియాతో హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీవీ అంపైర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లాపై ఐసీసీ రెండు వన్డేల నిషేధం విధించింది. 100 శాతం జరిమానా, మూడు డీమెరిట్ పాయింట్లు విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం 24 నెలల్లోనే స్టువర్ట్ లా డీమెరిట్ పాయింట్లు నాలుగుకు చేరడంతో ఆయనపై రెండు వన్డేల నిషేధం విధించిక తప్పలేదు. దీంతో భారత్‌తో గువాహటి, విశాఖలో జరిగే వన్డేలకు ఆయన అందుబాటులో ఉండడు. భారత్‌తో రెండో టెస్టు మూడో రోజు ఆటలో విండీస్ ఆటగాడు కీరన్ పావెల్ ఔటైన వెంటనే స్టువర్ట్ లా టీవీ అంపైర్ గదిలోకి వెళ్లి దుర్భాషలాడాడు. ఆ తర్వాత నాలుగో అంపైర్ వద్దకు వెళ్లి ఆటగాళ్ల ముందరే ఇబ్బందికరంగా మాట్లాడాడు. అంపైరు ఆయనపై రిఫరీకి ఫిర్యాదు చేశారు. సోమవారం స్టువర్ట్ తన తప్పును అంగీకరించడంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానల్ సభ్యుడు క్రిస్‌బ్రాడ్ అతనిపై నిషేధం విధించారు. 2017, మేలో పాకిస్తాన్‌తో జరిగిన డొమినికా టెస్టు చివరి రోజు స్టువర్ట్ ఇలాగే నిబంధనలు ఉల్లంఘించడంతో 25 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. విండీస్‌పై భారత్ 2-0తో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. -
గేల్ పనికి రాకుండా పోయాడా?
విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ సరిగ్గా రాణించకపోవటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ లీగ్స్‌లో(ఐపీఎల్, బీపీఎల్) అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. స్వదేశీ జట్టు తరపున మాత్రం పేలవమైన ప్రదర్శన ఇస్తున్నాడు. తాజాగా బీపీఎల్ ఫైనల్లో 146 పరుగులు చేసిన ఈ జెయింట్ బ్యాట్స్‌మన్.. న్యూజిలాండ్ సిరీస్‌లో ఘోరంగా విఫలం కావటంతో అవి మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తం 4 మ్యాచుల్లో 38 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో ఇక అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైం వచ్చిందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో జట్టు కోచ్ సువర్ట్ లా గేల్‌కు అండగా నిలుస్తున్నాడు. ‘‘ప్రస్తుతం అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అందుకే కివీస్ తో సిరీస్‌లో బంతులు ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బందులపాలయ్యాడు. ఇంతకు ముందు ఇంగ్లాండ్ సిరీస్‌లో అతను రాణించిన విషయాన్ని విమర్శకులు మరిచిపోయారేమో! విమర్శలను గేల్ కూడా పట్టించుకోవటమే మంచింది. ప్రత్యర్థులపై విరుచుకుపడే సత్తా అతనికి మరికొంత కాలం ఉంది’’ అని లా పేర్కొన్నారు. న్యూజిలాండ్ సిరీస్ ఓటమి ఒక్క గేల్ మూలంగా కాదని.. మొత్తం జట్టు వైఫల్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ విషయంలో బోర్డు, అతన్ని తొలగించాలని పట్టుబడుతున్న కొందరు జట్టు సభ్యులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని లా సూచిస్తున్నారు. -
థర్డ్ అంపైర్ గదిలోకి వెళ్లి అనుచిత వ్యాఖ్యలు..
ముంబై:క్రికెటర్ల అనుచిత ప్రవర్తనతో జరిమానా పడిన సందర్భాలే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే కోచ్‌లు ఐసీసీ ఆగ్రహానికి గురి కావడం చాలా అరుదు. తాజాగా వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా నిబంధనల్ని ఉల్లంఘించాడు. టెస్టు ఆఖరిరోజు రెండోసెషన్‌లో షేన్ డోరిచ్ ఔటైన తర్వాత లా ధర్డ్అంపైర్ గదిలోకి వెళ్లాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించిన థర్డ్ అంపైర్‌ను ప్రశ్నించడంతో పాటు గది నుంచి వెళ్లేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ నియమావళి ప్రకారం ఆటగాళ్లతో పాటు ఆటగాళ్ల సహాయ సిబ్బంది అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే. దాంతో అతనిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. -
విండీస్ కోచ్‌గా స్టువర్ట్ లా
ఆంటిగ్వా: గతేడాది సెప్టెంబర్ లో ఫిల్ సిమ్మన్స్‌ను కోచ్‌గా తొలగించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు కొత్త కోచ్‌ను నియమించింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ లాను కోచ్‌గా నియమించినట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసిన విండీస్ క్రికెట్ బోర్డు.. వచ్చే నెల 15వ తేదీ నుంచి స్టువర్ట్ లా జట్టు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గతంలో శ్రీలంకకు కోచ్‌గా పని చేసిన స్టువర్ట్ లా అనుభవం తమకు ఉపయోగపడుతుందని విండీస్ బోర్డు అభిప్రాయపడింది. -
పీసీబీకి మళ్లీ నిరాశే!
కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవి కోసం సుదీర్ఘ అన్వేషణలో ఉన్న పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు)కు మరోసారి నిరాశే ఎదురైంది. పాకిస్తాన్ కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టువర్ట్ లాతో జరిపిన చర్చలు విఫలయత్నంగానే ముగిసాయి. పాక్ కోచ్ పదవిపై స్టువర్ట్ లా పేరు దాదాపు ఖరారైన తరుణంలో అతను పీసీబీకి ఝలక్ ఇచ్చాడు. తాను ఇప్పటికిప్పుడు కోచ్ పదవిని చేపట్టడానికి సిద్ధంగా లేనంటూ స్టువర్ట్ లా తేల్చి చెప్పాడు. తాను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో ఇప్పటికే బ్యాటింగ్ కన్సెల్టెంట్‌గా ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో పాక్ కోచ్ పదవిని ఉన్నపళంగా స్వీకరించలేనంటూ పీసీబీకి తెలియజేశాడు. దీనిపై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. పాక్ కోచ్ పదవి కోసం స్టువర్ట్ లా దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ ఆస్ట్రేలియాతో ఒప్పందం ఉన్న దరిమిలా అతను కోచ్ పదవిపై వెనకడుగు వేసినట్లు తెలిపారు. తమ మొదటి చాయిస్ గా స్టువర్ట్ లాను అనుకున్నా.. అతను ఆకస్మికంగా విముఖత వ్యక్తం చేశాడన్నారు. మరోసారి స్టువర్ట్‌ను సంప్రదించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పాక్ కోచ్ రేసులో ఇంగ్లండ్ కు చెందిన ఆండీ మూల్స్, ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మెన్ డీన్ జోన్స్ లు ఉన్నట్లు షహర్యార్ తెలిపారు. వచ్చే నెల్లో పాక్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటించనున్న నేపథ్యంలో కోచ్ పదవిపై మరో రెండు, మూడు రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని షహర్యార్ పేర్కొన్నారు. అంతకుముందు పాక్ కోచ్ పదవిపై ఇంగ్లండ్ మాజీ కోచ్ పీటర్ మూర్స్ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
పాక్ కోచ్‌గా స్టువర్ట్ లా!
కరాచి: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టువర్ట్ లా పేరు వినిపిస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించలే దు. కానీ మంగళవారం లాహోర్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) సమావేశం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. స్టువర్ట్ లాను కోచ్‌గా నియమించాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. మరోవైపు ఫిబ్రవరిలో యూఏఈలో నిర్వహించిన తొలి సీజన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ద్వారా రూ.17. 30 కోట్ల (2.6 మిలియన్ డాలర్స్) లాభాన్ని ఆర్జించిన ట్లు పీసీబీ వెల్లడించింది. -
చీర్ లీడర్స్‌ని తీసేస్తారా?:బీసీసీఐపై స్టువర్ట్ లా ఫైర్
న్యూఢిల్లీ: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో చీర్ లీడర్స్‌ను నిషేధించిన బీసీసీఐపై ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు బ్రిస్బేన్ హీట్ కోచ్ స్టువర్ట్ లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చీర్ లీడర్స్ లేకపోవడంతో ఈ టోర్నీ సూపర్ బౌల్ టోర్నీని పోలి ఉందని విమర్శించారు. ‘ఈ వ్యవహారం నాకు అర్థం కావడం లేదు. చీర్ లీడర్స్ లేకపోతే టోర్నీలో మజా ఉండదు. సూపర్ బౌల్ టోర్నీలా ఉంది. నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. చీర్ లీడర్స్‌ను అభిమానులు విపరీతంగా అభిమానిస్తారు. ఇక మిగతా దేశాల్లో కూడా ఇలాగే చేస్తారేమో’ అని లా పేర్కొన్నారు. మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీలు క్రైమ్‌కు దారితీస్తున్నాయని అందిన నివేదికలతో పాటు ఫిక్సింగ్‌ను నిరోధించే చర్యల్లో భాగంగా బీసీసీఐ చీర్ లీడర్స్‌పై నిషేధం విధించింది.