థర్డ్ అంపైర్ గదిలోకి వెళ్లి అనుచిత వ్యాఖ్యలు..
ముంబై:క్రికెటర్ల అనుచిత ప్రవర్తనతో జరిమానా పడిన సందర్భాలే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే కోచ్లు ఐసీసీ ఆగ్రహానికి గురి కావడం చాలా అరుదు. తాజాగా వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా నిబంధనల్ని ఉల్లంఘించాడు. టెస్టు ఆఖరిరోజు రెండోసెషన్‌లో షేన్ డోరిచ్ ఔటైన తర్వాత లా ధర్డ్‌అంపైర్ గదిలోకి వెళ్లాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించిన థర్డ్ అంపైర్‌ను ప్రశ్నించడంతో పాటు గది నుంచి వెళ్లేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ నియమావళి ప్రకారం ఆటగాళ్లతో పాటు ఆటగాళ్ల సహాయ సిబ్బంది అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే. దాంతో అతనిపై ఐసీసీ చర్యలు తీసుకుంది.