తిరువనంతపురం: భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా పేర్కొన్నాడు. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన తమ జట్టు.. బలమైన భారత్‌కు వారి దేశంలోనే గట్టిపోటీ ఇచ్చిందన్నాడు. ఈ విషయం తొలి మూడు వన్డేలను చూస్తే అర్ధమవుతుందన్నాడు. కాగా, తొలి మూడు వన్డేల తర్వాత చివరి రెండు వన్డేల్లో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందడంపై స్టువర్ట్‌లా చమత్కరించాడు. మూడు వన్డేలకే తమ ఆటగాళ్లలో పెట్రోల్ అయిపోయిందని సెటైర్ వేశాడు.
‘మా కుర్రాళ్లు తెలివైన వారు. నైపుణ్యం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అనుభవం వారికి రావాలి. నలభైవేల మంది అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే అత్యుత్తమ జట్టుతో తలపడడం అంత సులువు కాదు. ఆ పరిస్థితులను అనుభవిస్తే అలవాటవుతుంది. గెలవాలంటే నైపుణ్యం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మూడు వన్డేల తర్వాత మా జట్టు వైఫల్యం చెందడానికి కారణం ఆటగాళ్లలో తగినంత అనుభవం లేకపోవడమే’ అని స్టువర్ట్ లా పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఇక్కడ చదవండి: ముగింపు అదిరింది
Comments
Please login to add a commentAdd a comment