పాకిస్తాన్లో విండీస్ పర్యటన!
ఆంటిగ్వా: గత ఏడేళ్లుకు పైగా తమ దేశంలో క్రికెట్ మ్యాచ్లను ఆడించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎట్టకేలకు సఫలమైనట్లే కనబడుతోంది. త్వరలో పాకిస్తాన్లో వెస్టిండీస్ జట్టు పర్యటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ మేనేజర్ రోలాండో హోల్డర్ తాజాగా చేసిన ప్రకటన అందుకు బలం చేకూరుస్తోంది.
'పాకిస్తాన్లో రెండు ట్వంటీ 20 మ్యాచ్లు ఆడాలంటూ పీసీబీ విన్నవించింది. దానిలో భాగంగా అక్కడి భద్రతాపరమైన అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను అందజేసింది. అయితే పాక్ ఇచ్చిన సెక్యూరిటీ ఆధారంగా అక్కడకు మా ప్రతినిధిని ఒకర్ని పంపిస్తున్నాం. ఆ తరువాత మాత్రమే పాక్లో సిరీస్పై నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ మా ఆటగాళ్ల భద్రతోపాటు, సిబ్బంది భద్రత కూడా ముఖ్యం. దానిలో భాగంగా ఆ మ్యాచ్లు జరిగే వేదికల వద్ద రెక్కీ నిర్వహించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటాం.భద్రతపరంగా ఎటువంటి ఇబ్బంది లేకపోతే అక్కడ ఆడటానికి మాకు అభ్యంతరం లేదు'అని హోల్డర్ తెలిపారు. ఒకవేళ పాక్ లో ట్వంటీ 20 సిరీస్కు విండీస్ మొగ్గు చూపిన పక్షంలో మార్చిలో ఆ సిరీస్ నిర్వహించే అవకాశం ఉంది.
పాకిస్తాన్లో సెక్యూరిటీపై వెస్టిండీస్ స్టార్ ఆటగాడు ఆండీ రస్సెల్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతున్న రస్సెల్.. ఆ దేశంలో ఆడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని తన అనుభవాన్ని తెలియజేశాడు. మరొకవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ డారెన్ స్వామీ కూడా పాక్లో పర్యటనపై సందిగ్థత వ్యక్తం చేశాడు. భద్రతాపరమైన క్లియరెన్స్ వస్తే పాకిస్తాన్లో ఆడటానికి అభ్యంతరం ఏమీ ఉండదంటూ పేర్కొన్నాడు.