సెయింట్‌కిట్స్: వెస్టిండీస్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ టైగా ముగిసింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో వెస్టిండీస్ ఘన విజయం సాధించి సిరీస్‌ను టై చేసుకుంది. తొలి టీ20లో ఐర్లాండ్ విజయం సాధించగా, రెండో టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. మూడో టీ20లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెవిన్ ఒబ్రెయిన్(36), ఆండ్రూ బాల్బిర్మి(28)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ఐర్లాండ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.(ఇక్కడ చదవండి: ఐర్లాండ్ ‘పవర్ ప్లే’ రికార్డు)
విండీస్ బౌలర్లు సమష్టిగా రాణించి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. కీరోన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవోలు తలో మూడు వికెట్లతో రాణించగా, రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్‌లు చెరో వికెట్ తీశారు.ఆపై 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ వికెట్ మాత్రమే నష్టపోయి విజయం సాధించింది. ఎవిన్ లూయిస్(46; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించగా, లెండిల్ సిమ్మన్స్(91 నాటౌట్; 40 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగించి ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. సిమ్మన్స్ సాధించిన పరుగుల్లో 80 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. దాంతో విండీస్ 11 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment