ఆట మళ్లీ మొదలు | West Indies v India, T20I Series | Sakshi
Sakshi News home page

ఆట మళ్లీ మొదలు

Published Sat, Aug 3 2019 4:47 AM | Last Updated on Sat, Aug 3 2019 10:31 AM

West Indies v India, T20I Series - Sakshi

బ్రాత్‌వైట్‌

లాడర్‌హిల్‌ (అమెరికా): మెరుగైన ప్రత్యామ్నాయాలే అనుకోనీ... భవిష్యత్‌ జట్టు రూపమే అనుకోనీ... వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో యువ రక్తంతో బరిలో దిగుతోంది టీమిండియా. బ్యాటింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండేలను పరీక్షిస్తూ, కీపింగ్‌లో రిషభ్‌ పంత్‌పై పూర్తి బాధ్యత మోపుతూ, బౌలింగ్‌లో నవదీప్‌ సైనీ, రాహుల్‌ చహర్‌లను ప్రయోగిస్తూ కరీబియన్‌ పర్యటనను ప్రారంభించనుంది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల            సిరీస్‌లో భాగంగా శనివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా తొలి టి20 జరుగనుంది. ప్రపంచ కప్‌ నుంచి రిక్తహస్తాలతో తిరిగొచ్చిన నేపథ్యంలో.. అభిమానుల ఆవేదనను మరిపించేందుకు కోహ్లి సేనకు ఇదో అవకాశం. అయితే, పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్లయిన వెస్టిండీస్‌ అనూహ్య ఆటకు పెట్టింది పేరు. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చగల హిట్టర్లున్న ఆ జట్టుపై యువ భారత్‌ ఎలా పైచేయి సాధిస్తుందో చూడాలి.

ధావన్‌ వచ్చాడు.. నంబర్‌ 4లో రాహుల్‌  
సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పునరాగమనం ఈ సిరీస్‌లో టీమిండియాకు పెద్ద ఉపశమనం. ఎప్పటిలానే రోహిత్, కోహ్లికి అండగా అతడు రాణిస్తే తిరుగుండదు. కానీ, అందరి చూపు నంబర్‌ 4 పైనే. మంచి స్కోర్లతో ఈ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ పాతుకుపోవాలని జట్టు ఆశిస్తోంది. ప్రస్తుతానికి మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లలో ఒకరికే అవకాశం దక్కే వీలుంది. మున్ముందు రాహుల్‌ విఫలమైతే ఈ ఇద్దరికీ చోటుంటుంది. ఇక ఎటువంటి బాదరబందీ లేకుండా ఏకైక వికెట్‌ కీపర్‌గా ఉన్న పంత్‌ తన ప్రత్యేకత చాటాల్సి ఉంది. స్పిన్‌ ఆల్‌రౌండర్లలో జడేజా ఖాయం. రాహుల్‌ చహర్‌ వైపు మొగ్గితే కృనాల్‌ పాండ్యా బెంచ్‌కే పరిమితం అవుతాడు. ప్రత్యర్థి జట్టులో నలుగురు ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌ ఉన్నందున ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకున్నా ఆశ్చర్యం లేదు. భువనేశ్వర్, ఖలీల్‌ అహ్మద్‌కు తోడు మూడో పేసర్‌గా సైనీ, దీపక్‌ చహర్‌లలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. విండీస్‌ దూకుడైన ఆటకు అడ్డుకట్ట వేయాలంటే పెద్దగా అనుభవం లేని దళంతో భువీ మరింత కష్టపడాల్సి ఉంటుంది.

విండీస్‌ విజృంభించగలదా?
సాధారణంగా చూస్తే విండీస్‌తో టి20 అంటే కొంత కష్టమే అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఆ జట్టు కొంత బలహీనంగా ఉంది. గేల్, రసెల్‌ లేనందున లూయీస్, పూరన్, హెట్‌మైర్‌ బ్యాటింగ్‌ భారం మోయాల్సి వస్తోంది. పొలార్డ్‌ రాణిస్తే ఇబ్బంది ఉండదు కానీ, అతడి ఫామ్‌ అనిశ్చితం. రావ్‌మన్‌ పావెల్, పియర్‌ సత్తా ఏమిటో తెలియాల్సి ఉంది. మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ పునరాగమనం వారికి ఊరట. కానీ పేసర్లు కాట్రెల్, ఒషాన్‌ థామస్, కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌లకు భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ విసిరే స్థాయి లేదు. వీరిలో ప్రపంచ కప్‌లో ఆకట్టుకున్న కాట్రెల్‌ కాస్త మెరుగు. బ్యాట్స్‌మెన్‌ అసాధారణ స్థాయిలో రాణిస్తే విజయంపై విండీస్‌ ఆశలు పెట్టుకోవచ్చు.

రసెల్‌ ఔట్‌
సిరీస్‌కు ముందే విండీస్‌కు ఎదురుదెబ్బ. హార్డ్‌ హిట్టింగ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ గాయంతో టి20 సిరీస్‌ మొత్తానికే దూరమయ్యాడు. అతడి స్థానంలో బ్యాట్స్‌మన్‌ జేసన్‌ మొహమ్మద్‌కు చోటిచ్చారు. ఇప్పటికే విధ్వంసక ఓపెనర్‌ గేల్‌... జట్టుకు అందుబాటులో లేడు. రసెల్‌ సేవలను కూడా కోల్పోయిన విండీస్‌ ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.

 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, పాండే/అయ్యర్, పంత్, జడేజా, దీపక్‌ చహర్‌/ సైనీ, భువనేశ్వర్, ఖలీల్, రాహుల్‌ చహర్‌.
వెస్టిండీస్‌: ఎవిన్‌ లూయీస్, జాన్‌ కాంప్‌బెల్, పూరన్, హెట్‌మైర్, పొలార్డ్, రావ్‌మన్‌ పావెల్, ఖారీ పియర్, బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), నరైన్, కాట్రెల్, థామస్‌/కీమో పాల్‌.  


రోహిత్‌... రికార్డుకు 4 సిక్స్‌ల దూరంలో  
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టి20ల్లో అత్యధిక సిక్స్‌ల వీరుడి రికార్డుకు మరో 4 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ 105 సిక్స్‌లతో (58 మ్యాచ్‌ల్లో) టాప్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (76 మ్యాచ్‌ల్లో 103 సిక్స్‌లు), రోహిత్‌ (94 మ్యాచ్‌ల్లో 102 సిక్స్‌లు) అతడి వెనుక నిలిచారు. శనివారం నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే మూడు టి20ల సిరీస్‌కు గేల్‌ దూరంగా ఉన్నందున అతడి రికార్డును రోహిత్‌ తేలిగ్గా అధిగమించే వీలుంది.

క్రిస్టియానో రొనాల్డొ నాకు స్ఫూర్తి
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  
జ్యూరిచ్‌: ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా స్టార్‌ లయోనల్‌ మెస్సీ, పోర్చుగల్‌ దిగ్గజం రొనాల్డొలలో ఎవరు గొప్ప అనేది ఎడతెగని చర్చనీయాంశం. దీనిపై మొత్తం ప్రపంచమే రెండుగా విడిపోయినట్లుగా ఉంటుంది. ఇదే విషయం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అడగ్గా... సందేహం లేకుండా రొనాల్డోకే ఓటేశాడు. సవాళ్లను రొనాల్డొ సమర్థంగా స్వీకరించిన తీరే దీనికి కారణంగా చెప్పాడు. ఫిఫా డాట్‌ కామ్‌తో మాట్లాడుతూ ‘నాకు రొనాల్డొ స్ఫూర్తి ప్రదాత. నా దృష్టిలో అందరికంటే అతడే ముందుంటాడు. ఆట పట్ల రొనాల్డొ నిబద్ధత, విపరీతమైన ఆరాధనను దేనితోనూ పోల్చలేం. అది ప్రతి మ్యాచ్‌లోనూ కనిపిస్తుంది. రొనాల్డొ ఏ క్లబ్‌కు ఆడితే ఆ క్లబ్‌నే నేను ఇష్టపడతా’ అని స్పష్టం చేశాడు. రొనాల్డొను పరిపూర్ణ ఆటగాడిగా కోహ్లి అభివర్ణించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement