
వెస్టిండీస్‌పై ఆసీస్ గెలుపు
ముక్కోణపు వన్డే టోర్నీ
గయానా: ఐపీఎల్ ఫామ్‌ను వార్నర్ (55 నాటౌట్: 3 ఫోర్లు, 1 సిక్సర్) ముక్కోణపు సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. దీంతో వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 32.5 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు లియోన్ (3/39), ఆడమ్ జంపా (3/16), స్టార్క్ ( 2/37) అద్భుతంగా రాణించడంతో... సొంత గడ్డపై విండీస్ అత్యల్ప స్కోరును నమోదుచేసింది. చార్లెస్ (22), బ్రాత్‌వైట్ (21) కాసేపు ఆసీస్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నా వారి ముందు నిలవలేకపోయారు.
117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 25.4 ఓవ ర్లలోనే చేధించి ఆసీస్ బోనస్ పాయింట్‌ను తన ఖాతాలో వేసుకుంది. భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్‌కు, ఫించ్(19), మిచెల్ మార్ష్ (9 నాటౌట్) సహకారం అందించారు. ఖవాజా 27 పరుగులతో రాణించినా... స్మిత్(6), మాక్స్‌వెల్(0)లు నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీసుకోగా... బెన్, హోల్డర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బౌలర్ లియోన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.