ఇక కోలుకోవడం చాలా కష్టం: క్రిస్ గేల్
వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫోర్క్, చిన్న కత్తి లాంటి వాటితో కూడా సిక్సర్లు కొట్టగలనని ఇటీవల చెప్పిన గేల్.. వెస్టిండీస్ జట్టు పూర్వ వైభవం తెచ్చుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. సమీప భవిష్యత్తులో కూడా తమ జట్టు టెస్టుల్లో రాణించే అవకాశాలు కనిపించడం లేదన్నాడు. ప్రస్తుత క్రికెట్ విధానంతో టెస్టుల్లో కరీబియన్లు ఓటముల నుంచి కోలుకుని రాణించడం సాధ్యం కాదన్నాడు. అవకాశమిస్తే తాను 2019 వన్డే ప్రపంచ కప్ లో ఆడతానని, బహుశా అప్పటివరకే తన వన్డే కెరీర్ ఉంటుందని చెప్పాడు. గతంలో కేవలం ఫాస్ట్ బౌలర్లు మాత్రమే జట్టుకు విజయాలు అందించేవార ఇప్పుడు రెండు విభాగాలలో అలాంటి పరిస్థితి లేదన్నాడు.
క్రిస్ గేల్ 103 టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు బాదడంతో పాటు మొత్తం 7214 పరుగులు చేశాడు. ఇటీవల తమ జట్టు స్వదేశంలో భారత్ చేతిలో, విదేశాలలో పాకిస్తాన్ చేతిలో సిరీస్ లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశాడు. ఏకాగ్రత, నిరంతర కృషి ఉంటేనే ఈ పార్మాట్లో రాణించగలరని చెప్పాడు. టీ20 అనేది తక్కువ సమయంలో మ్యాచ్ ముగుస్తుంది కనుక కొద్దిసేపు రాణిస్తే సరిపోతుందని.. అందుకే వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ లు నెగ్గుతుందన్నాడు. తర్వాతి తరం ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ పైనే దృష్టి పెడతారని, సుదీర్ఘ ఆటపై ఆసక్తి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నందున బిగ్ బాష్ లో ఆడటం లేదని, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ లలో రాణించడంపైనే దృష్టి సారించినట్లు క్రిస్ గేల్ వివరించాడు.