ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.
ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్‌లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.
ఇప్పటికే పలు స్థానిక లీగ్‌లు
ఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్‌లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
అదే స్పెషల్ ఇక్కడ
మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్‌లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని వెల్లడించింది.
ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్‌గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment