ఐపీఎల్ 2024 ఎడిషన్ తొలి విడత షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తొలి విడతలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. డే గేమ్స్ మధ్యాహ్నం 3:30 గంటలకు.. నైట్ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
కాగా, తొలి విడత షెడ్యూల్‌లో ఓ ఆసక్తికర విషయం అందరి దృష్టిని ఆకర్శించింది. అన్ని జట్లు తమ హోం గేమ్స్‌ను సొంత మైదానాల్లో ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే సొంత మైదానంలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆడుతుంది.
ఇందుకు కారణంగా ఏంటని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ జరుగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్ సెకెండ్ ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇక్కడ 11 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డీసీ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు హోం గేమ్స్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్.. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ఏప్రిల్ 3న కేకేఆర్‌తో విశాఖలో ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన ఐదు హోం గేమ్స్‌ను సొంత మైదానంలోనే ఆడుతుంది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 28న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో (రాత్రి 7:30).. మార్చి 31న విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో (రాత్రి 7:30).. ఏప్రిల్ 3న విశాఖ వేదికగా కేకేఆర్‌తో (రాత్రి 7:30) డీసీ తలపడనుంది. అన్ని అనుకూలిస్తే.. విశాఖలో రిషబ్ పంత్ మెరుపులు చూసే అవకాశం కూడా ఉంటుంది. పంత్ కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకుని రానున్న ఐపీఎల్‌లో ఆడతాడని ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment