
తిరువనంతపురం: టీమిండియాతో తొలి మూడు వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో విశేషంగా రాణించిన వెస్టిండీస్.. చివరి రెండు వన్డేల్లో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క‍్రమంలోనే చివరిదైన ఐదో వన్డేలో విండీస్ చెత్త రికార్డును మూటగట్టకుంది. గురువారం ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ 104 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను విండీస్ సొంతం చేసుకుంది. ఇది భారత్‌పై వన్డేల్లో విండీస్‌కు అత్యల్ప స్కోరు. 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. ఇది ఇప్పటివరకూ భారత్‌పై విండీస్‌కు అత్యల్ప స్కోరు కాగా, దాన్ని తాజాగా సవరించింది.
ఈ మ్యాచ్‌లో విజృంభించిన టీమిండియా బౌలర్లు.. విండీస్‌ను పేకమేడలా కూల్చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో వికెట్ లభించింది. ఇదిలా ఉంచితే, తొలి మూడు వన్డేల్లో 926 పరుగులు చేసిన విండీస్. చివరి రెండు వన్డేల్లో కలిపి 257 పరుగుల్ని మాత్రమే సాధించి 20 వికెట్లను కోల్పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment