షాపింగ్ చేసుకోమనే కోచ్ కావాలేమో!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాల కారణంగా తన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నినెలలుగా వీరిద్దరూ మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధానికి కుంబ్లే రాజీనామా ద్వారా ముగింపు పలికాడు. ఇక భారత్ క్రికెట్ జట్టు కోచ్ గా పనిచేయలేనంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి రాజీనామా లేఖను పంపాడు. విండీస్ పర్యటనకు అనిల్ కుంబ్లే వెళ్లాల్సిన ఉన్నప్పటికీ, భారత క్రికెటర్లతో సఖ్యత లేనికారణంగా కుంబ్లే బయటకొచ్చేశాడు.
కాగా, కోచ్ విషయంలో భారత క్రికెటర్ల తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అసలు భారత క్రికెటర్లకు ఎటువంటి కోచ్ కావాలంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక్కడ ఏ ఒక్కర్నీ టార్గెట్ చేయకుండా టీమిండియా క్రికెటర్ల తీరును తప్పుబట్టాడు. ' మన ఆటగాళ్లను చూస్తుంటే మెతకగా ఉండే కోచ్‌ను కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్‌కు వెళ్లండి అని చెప్పే కోచ్ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి'అని గావస్కర్ మండిపడ్డాడు.