
కొడుకు ఊచకోత... తండ్రి ‘ఆపరేషన్’
భారత్‌తో ముంబైలో ఆదివారం జరిగిన చివరి వన్డేలో డివిలియర్స్ ఎలా ఆడాడో గుర్తుందిగా... బౌలర్లను ఊచకోత కోసి మెరుపు సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి అబ్బురపరిచాడు. అయితే అదే సమయంలో డివిలియర్స్ తండ్రి (ఆయన పేరు కూడా ఏబీ డివిలియర్స్) దక్షిణాఫ్రికాలోని వార్మ్‌బాత్స్ అనే చిన్న పట్టణంలో రెండు ప్రాణాలను కాపాడారు. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. స్పోర్ట్స్ మెడిసిన్ కూడా చదివిన డివిలియర్స్ సీనియర్ ప్రఖ్యాత సర్జన్.
ఆదివారం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చూడటానికి ఇంట్లో కూర్చున్న ఆయనకు... ఓ మహిళ ప్రసవ వేదన చెందుతూ చాలా సీరియస్‌గా ఉందని తెలిసింది. అంతే.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్ చేశారు. ఆ మహిళతో పాటు పండంటి పాపను కాపాడారు. సాధారణంగా కుమారుడు ఎక్కడ ఆడుతున్నా తప్పకుండా చూసే డివిలియర్స్ సీనియర్ ఆ గొప్ప ఇన్నింగ్స్ మాత్రం చూడలేకపోయారు.
కొడుకు చేసిన సెంచరీ చూడటం కంటే రెండు ప్రాణాలను కాపాడటంలోనే ఎక్కువ ఆనందం ఉందని ఆయన చెబుతున్నారు. అన్నట్లు... డివిలియర్స్ తాత పేరు కూడా ఏబీ డివిలియర్స్ అట. నవంబరు 14 నుంచి బెంగళూరులో జరిగే టెస్టుతో డివిలియర్స్ 100 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూ సేందుకు అతని కుటుంబసభ్యులు వస్తున్నారు.