ప్రయోగాల వేళ...
► ఉత్సాహంతో కొత్త కుర్రాళ్లు
► సత్తా నిరూపించుకునేందుకు సిద్ధం
► నేడు జింబాబ్వేతో తొలి వన్డే
ప్రతిభాన్వేషణ... ప్రయోగాలు... భవిష్యత్తు కోసం సన్నద్ధత... సత్తా నిరూపించుకునే అవకాశం... పేరు ఏదైనా కావచ్చు... భారత ‘జూనియర్’ జట్టు ఇప్పుడు జింబాబ్వే ‘సీనియర్’ టీమ్‌తో పోటీకి సిద్ధమైంది. దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనేక మంది ఆటగాళ్లకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక లభించింది. నేటినుంచి జరిగే సిరీస్‌లో కొత్త కుర్రాళ్లకు ఇదో మంచి అవకాశం కాగా... ఈ జట్టును ధోని నడిపిస్తుండటం వారిలో మరింత స్ఫూర్తి పెంచే అంశం. అనుభవం లేకపోయినా భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తుండగా, సొంతగడ్డపై జింబాబ్వే ఏ మాత్రం పోటీనివ్వగలదో చూడాలి.
హరారే: కెప్టెన్ ధోని ఒక్కడే 275 వన్డేలు ఆడితే, మిగతా 15 మంది కలిపి ఆడిన మ్యాచ్‌లు 83 మాత్రమే. జింబాబ్వేతో సిరీస్‌లో తలపడే భారత జట్టు అనుభవం ఏమిటో చెప్పే లెక్క ఇది. అయితే ఐపీఎల్ ద్వారా కావాల్సినంత అనుభవం సంపాదించిన వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలరు. ఇప్పుడు ఈ జట్టు జింబాబ్వేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. మరో వైపు జింబాబ్వే మాత్రం సిరీస్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమై తన నంబర్‌వన్ జట్టునే బరిలోకి దించుతోంది. 2013, 2015లో కూడా ద్వితీయ శ్రేణి జట్టుతోనే జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఆ రెండు సార్లూ వన్డే సిరీస్‌లను 5-0, 3-0తో క్లీన్ స్వీప్ చేయడం విశేషం.
తుది జట్టులో ఎవరు
భారత జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. కేఎల్ రాహుల్ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. మరికొందరు జింబాబ్వేలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఈ జూనియర్ బృందంతోనే ఫలితాలు సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కోచ్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ధోనిని పక్కన పెడితే...రాయుడు, అక్షర్ పటేల్ చెప్పుకోదగ్గ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడారు. ఆరంభంలో ఆకట్టుకొని తర్వాత సెలక్టర్ల విశ్వాసం కోల్పోయిన వీరిద్దరు మళ్లీ రాణిస్తే రెగ్యులర్ స్థానం కోసం పోటీ పడవచ్చు.
అదే విధంగా తన చివరి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన మనీశ్ పాండే కూడా తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఇక్కడ బాగా ఆడటం అవసరం. రెగ్యులర్ టీమ్‌లో రైనా స్థానాన్ని భర్తీ చేయాలంటే పాండేతో పాటు కరుణ్ నాయర్‌కు కూడా మంచి అవకాశం లభించింది. బుమ్రా స్ట్రైక్ బౌలర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా, ధావల్ సహకరిస్తాడు. మూడో పేసర్ కోసం ఉనాద్కట్, బరీందర్ మధ్య పోటీ ఉంటుంది. ఇక యజువేంద్ర చహల్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తే...భవిష్యత్తులో లెగ్‌స్పిన్నర్‌గా ప్రధాన జట్టుకూ ఎంపికయ్యే అవకాశం ఉంది.
సంచలనంపై ఆశలు
ఈ సిరీస్ ఆరంభానికి ముందే జింబాబ్వే తమ కోచ్ వాట్‌మోర్, కెప్టెన్ హామిల్టన్ మసకద్జలను తప్పించింది. వారి స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఎన్తిని, క్రీమర్‌లపై తీవ్ర ఒత్తిడి ఉంది. గాయంతో దూరమైన పన్యగర మినహా జింబాబ్వే తమ అత్యుత్తమ జట్టునే సిరీస్ కోసం ఎంపిక చేసింది. అయితే గత ఏడాది కాలంగా ఆ జట్టు ప్రదర్శన తీసికట్టుగా ఉంది. టి20 ప్రపంచకప్‌లో సూపర్ 10కు అర్హత కూడా సాధించలేకపోయిన జింబాబ్వే వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్‌కంటే దిగువగా ఉంది. వేర్వేరు కారణాలతో ఆ జట్టు ప్రపంచ క్రికెట్‌తో పోటీ పడలేక వెనుకబడిపోయింది. జట్టు తాజా ఫామ్ చూస్తే కనీసం 50 ఓవర్లు పూర్తిగా ఆడగలదా అనే సందేహం కూడా కనిపిస్తోంది. అయితే సికందర్ రజా, సీన్ విలియమ్స్, హామిల్టన్ మసకద్జా, చిగుంబురా, ఇర్విన్ జట్టులో ఇప్పటికీ కీలక ఆటగాళ్లు. టీమ్ జయాపజయాలు వీరిపైనే ఆధారపడి ఉన్నాయి. తొలి వన్డేలో బరిలోకి దిగితే చిగుంబురా జింబాబ్వే తరఫున ఆండీ, గ్రాంట్ ఫ్లవర్ తర్వాత 200 వన్డేలు ఆడిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.
జట్లు
భారత్: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్‌దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్
జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్‌మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్.
ధోని ఏం చేస్తాడు?
జింబాబ్వేతో సిరీస్ తర్వాత ఈ సీజన్‌లో భారత్ పెద్ద సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లే ఆడనుంది. సొంతగడ్డపై కొన్ని వన్డేలు, టి20లు ఉన్నా వాటికి చాలా సమయం, మధ్యలో విరామం ఉంది. కాబట్టి కెప్టెన్‌గా ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించేది తక్కువే. ఇప్పుడు పసికూనవంటి జట్టును నడిపించేందుకు అతను సిద్ధమయ్యాడు. జింబాబ్వేతో సిరీస్ గెలిస్తే అందులో పెద్దగా విశేషం ఏమీ కనిపించకపోవచ్చు. ధోని కెప్టెన్సీకి అదనంగా కలిసొచ్చేదీ ఏమీ లేదు.
కానీ పొరపాటున ఏదైనా తేడా రావడమో, మ్యాచ్ ఓడటమో జరిగితే అతని పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోవచ్చు. ఈ ఒక్క సిరీస్‌తోనే నాయకత్వానికి ముప్పు వచ్చే సమస్య లేదు గానీ... కోహ్లి ఫామ్ నేపథ్యంలో ఇప్పటికే ధోనికి పొగ పెడుతున్నవారి సంఖ్య మరింత పెరిగిపోతుంది. కాబట్టి జట్టులో జూనియర్లే ఉన్నా రెండు సిరీస్‌లు గెలవడమే ధోని లక్ష్యం. 11 ఏళ్ల తర్వాత అతను జింబాబ్వే గడ్డపై సిరీస్ ఆడుతుండటం విశేషం.