
సాధిస్తారా?..సమర్పిస్తారా?
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ఉత్కంఠకు చేరుకుంది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు గెలిచి సమంగా నిలవడంతో ఇప్పుడు ఐదో వన్డేపైనే సిరీస్ ఫలితం ఆధారపడింది. విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో చివరదైన ఐదో వన్డే జరుగునుంది. శనివారం మధ్యాహ్నం గం.1.30ని.లకు ఇరు జట్ల మధ్య కీలకమైన ఐదో వన్డే జరుగనుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్కు సిద్ధమైన భారత-న్యూజిలాండ్లు ఇప్పటికే తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ ఇదే కావడంతో భారత క్రికెట్ జట్టు ఎలాగైనా సిరీస్ను సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ టెస్టుల్లో ఎదురైన క్లీన్ స్వీప్కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే వన్డే మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకమే.
ఇరు జట్లు రేపటి తుది జట్ల విషయంలో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా న్యూజిలాండ్ జట్టులో డెవిచ్కు విశ్రాంతి నిచ్చి హెన్రీని తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరోవైపు భారత జట్టులో గత మ్యాచ్లో విశ్రాంతినిచ్చిన ప్రధాన బౌలర్ బూమ్రా తుది జట్టులోకి రావొచ్చు. ఒకవేళ అది జరిగితే నాల్గో వన్డేలో ఆకట్టుకున్న ధవల్ కులకర్ణికి విశ్రాంతి తప్పకపోవచ్చు.కాని పక్షంలో అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్లో ఒకరి విశ్రాంతినిచ్చి కులకర్ణిని ఆడించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమం.. ఏది ఏమైనా వైజాగ్ మ్యాచ్ కీలకం కావడంతో ఇరు జట్లు పూర్తిస్థాయి ప్రదర్శనతో అభిమానులను అలరించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఇప్పటివకూ వైజాగ్లో భారత జట్టు ఐదు వన్డేలు ఆడింది. ఇందులో నాలుగింట విజయం సాధించిన టీమిండియా.. ఒకదాంట్లో మాత్రమే ఓటమి పాలైంది. 2005లో ఇక్కడ జరిగిన మొట్టమొదటి వన్డేలో పాకిస్తాన్పై భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తరువాత 2007లో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 2010 ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. 2011లో వెస్టిండిస్పై ఐదు వికెట్లతో విజయం నమోదు చేసింది. కాగా, 2013లో నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విసిరిన 289 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, 2014లో అక్టోబర్లో విండీస్ తో జరగాల్సిన వన్డే మ్యాచ్ తుపాను కారణంగా రద్దయ్యింది.
ఇక్కడ ధోనినే బెస్ట్
ధోని సొంత మైదానం రాంచీలో పేలవమైన రికార్డు కల్గిన మహేంద్ర సింగ్ ధోనికి వైజాగ్ స్టేడియంలో మాత్రం మంచి రికార్డే ఉంది.ఈ స్టేడియంలో 2005లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ధోని 148 పరుగులు నమోదు చేశాడు. ఇదే ఆ స్టేడియంలో ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. దాంతో ధోని మరోసారి బ్యాట్ ను ఝుళిపించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఈ స్టేడియంలో అత్యధిక భాగస్వామ్యం కూడా భారత జంటదే.2011లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో విరాట్-రోహిత్ల జోడి నాల్గో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఇది ఇక్కడ ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం.
ఈ స్టేడియంలోని గణాంకాలు..
అత్యధిక స్కోరు: 356/9(50 ఓవర్లలో)..(2005లోభారత-పాకిస్తాన్ మ్యాచ్లో)
అత్యల్ప స్కోరు:259/7(42.2 ఓవర్లలో).. (2007లో భారత-శ్రీలంక మ్యాచ్లో)
అత్యధిక వ్యక్తిగత స్కోరు:148-ఎంఎస్ ధోని(2005లో భారత-పాకిస్తాన్ మ్యాచ్లో)
అత్యుత్తమ బౌలింగ్:4/60-రవి రాంపాల్(2013 భారత-వెస్టిండీస్ మ్యాచ్లో)
అత్యధిక భాగస్వామ్యం:163, నాల్గో వికెట్కు రోహిత్-విరాట్ కోహ్లిల జోడి(2011లో విండీస్తో మ్యాచ్లో)
అత్యధిక పరుగులు: 334, విరాట్ కోహ్లి(మూడు వన్డేల్లో)
అత్యధిక వికెట్లు: ఆరు వికెట్లు, రవి రాంపాల్(రెండు వన్డేల్లో)