
ధోని అండ్ గ్యాంగ్ పైచేయి సాధించేనా?
మొహాలి:ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మరో మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగే మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగానే చెప్పొచ్చు. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సిరీస్లో సమంగా ఉండటంతో మూడో వన్డేలో విజయంతో పై చేయి సాధించాలని ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. రేపు మొహాలీలో మధ్యాహ్నం గం.1.30 ని.లకు ఆరంభం కానున్న మ్యాచ్లో ఇరు జట్లు తమ పూర్తి బలాబలాతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
గత మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు భారత్ తొలి రెండు వన్డేల్లో కొనసాగించిన తుది జట్టుతోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. కాగా, గత మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఊహించని షాకివ్వడం భారత శిబిరంలో కలవరానికి గురి చేసింది. ఈ విజయం మూడు టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన న్యూజిలాండ్ జట్టులో రెట్టించిన ఉత్సాహాన్నిచ్చింది.
దాంతో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మంచి టచ్ లోకి వచ్చాడు. తొలి వన్డేలో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన విలియమ్సన్.. రెండో వన్డేలో శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఆ జట్టులో పూర్తి విశ్వాసాన్ని నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంచితే న్యూజిలాండ్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ప్రత్యేకంగా క్యాచ్ల విషయంలో ఆ జట్టులోని ఆటగాళ్లు ఎటువంటి పొరబాట్లకు తావివ్వడం లేదు.
మొహాలిలో భారత్ కు మెరుగైన రికార్డు
మొహాలీలో భారత్ జట్టు మంచి వన్డే రికార్డును కల్గి వుంది. ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పీసీఏ)లో ఇప్పటివరకూ భారత్ ఓవరాల్ గా 13 వన్డేలు ఆడగా, ఎనిమిదింట విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఇక్కడ ఆస్ట్రేలియాతో చివరిసారి ఆడిన వరల్డ్ టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది.
ఓపెనర్ల భాగస్వామ్యం కీలకం
ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లో భారత ఓపెనర్ల నుంచి ఆశించిన భాగస్వామ్యం రాలేదు. ఒక ఎండ్ లో ఓపెనర్గా అజింక్యా రహానే ఫర్వాలేదనిపిస్తున్నా, మరోవైపు రోహిత్ శర్మ పూర్తిగా వైఫల్యం చెందుతున్నాడు. రేపటి మ్యాచ్లో కివీస్ను ఒత్తిడిలోకి నెట్టాలంటే మంచి ఆరంభం కావాలి. దాంతో పాటు మిడిల్ ఆర్డర్ లో కీలక భాగస్వామ్యం అవసరం. తొలి వన్డేలో విరాట్ చలవతో గట్టెక్కిన భారత్.. రెండో వన్డేలో విరాట్ విఫలం కావడంతోనే తేలిపోయింది. దాన్ని మిగతా టాపార్డర్ ఆటగాళ్లు అధిగమించాల్సి ఉంది. దాదాపు 13ఏళ్ల తరువాత భారత్లో భారత్పై వన్డే గెలుపు ఆనందంలో ఉన్న న్యూజిలాండ్ జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా మరోసారి మూల్యం చెల్లించుకోకతప్పదు. రేపటి మ్యాచ్లో సమష్టిగా పోరాడితేనే ధోని అండ్ గ్యాంగ్ సిరీస్లో పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ కూడా కీలకం కావడంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు.