
ఓడిపోయాక డిన్నర్ చేద్దాం లే..
రెండో రోజు మ్యాచ్ సజావుగానే సాగినా సోమవారం ఆట మాత్రం వాడివేడిగా సాగింది. జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం అలవాటులో భాగంగా తన బ్యాట్‌ను కత్తిసాము చేసినట్టుగా తిప్పడాన్ని వేడ్ అవహేళన చేశాడు. ‘ఎందుకు ఇలా చేస్తుంటావు? నీ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా ఇలాంటి చెత్తే ఉంటుంది’ అని రెచ్చగొట్టాడు. జడేజా అంపైర్ దగ్గరికి వెళ్లి ‘తను ఆపకపోతే నేను ప్రారంభించాల్సి ఉంటుంది’ అని చెప్పడంతో అంపైర్ జోక్యం చేసుకుని ఆటపై దృష్టి పెట్టండి అని హితవు పలికారు.
ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ అవుట్ కాగా తను రివ్యూ కోరాడు. రీప్లేలో తను అవుట్ అయినట్టు తేలగా మైదానం వీడుతున్నప్పుడు వేడ్... జడేజాతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మధ్యలో అశ్విన్ కల్పించుకుని సముదాయించగా క్రీజులోకి వెళ్లిన వేడ్.. అక్కడ విజయ్‌తోనూ వాదనకు దిగాడు. అంపైర్లు పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత తమ మధ్య జరిగిన సంభాషణను జడేజా బయటపెట్టాడు. ‘ఏమీ జరగలేదు. మీరు ఓడిపోయాక అంతా కలిసి డిన్నర్ చేద్దాం’ అని వేడ్‌తో అన్నట్టు తెలిపాడు.