పాక్‌ను ఓడించి వీర జవాన్లకు అంకితమిస్తాం
బెంగళూరు: ఆసియా చాంపియన్‌స ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించి... ఆ విజయాన్ని వీరజవాన్లకు అంకితమిస్తామని భారత సీనియర్ హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేశ్ తెలిపాడు. ఉడీ ఉదంతం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ నిప్పురాజుకున్న సంగతి తెలిసిందే. మలేసియాలోని కుంటాన్‌లో వచ్చే నెల 20 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరగనుంది.
ఇందులో భారత సైనికులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చబోమని దాయాది జట్టును ఓడించి మన జవాన్లకు జోహార్లు అర్పిస్తామని శ్రీజేశ్ చెప్పాడు. ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థుల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ స్థాయికి తగినట్లు ఆడలేకపోతోందని, అయితే ఆ జట్టు గట్టి ప్రత్యర్థేనని తెలిపాడు. ఆ టోర్నీ కోసం ప్రస్తుతం సీనియర్ హాకీ జట్టుకు ఇక్కడి ‘సాయ్’ సెంటర్‌లో నాలుగు వారాల పాటు సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
నేడు జూనియర్ల పోరు
ఢాకా: ఆసియా కప్ అండర్-18 టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య గురువారం సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో తొలి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన భారత్... తర్వాతి మ్యాచ్‌లో ఒమన్‌పై గోల్స్ సునామీతో 11-0తో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జోరు మీదున్న భారత్ ఇదే స్ఫూర్తితో పాక్‌ను కంగుతినిపించాలనే ఉత్సాహంతో ఉంది. ఇబుంగో సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ చెరో 4 గోల్స్ సాధించి చక్కని ఫామ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ కూడా వరుస విజయాలతో ఊపుమీదుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు.