‘నల్ల కలువలు’ అవుట్ | Williams sisters lose in 2nd round | Sakshi
Sakshi News home page

‘నల్ల కలువలు’ అవుట్

Published Thu, May 29 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

‘నల్ల కలువలు’ అవుట్

‘నల్ల కలువలు’ అవుట్

రెండో రౌండ్‌లోనే ఓడిన సెరెనా, వీనస్
 ష్కిమిద్లోవా, గార్బిన్ సంచలనం  
 ఫ్రెంచ్ ఓపెన్
 
 పారిస్: యువ తారల దూకుడుకు ‘అమెరికా నల్లకలువలు’ వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ చేతులెత్తేశారు. నమ్మశక్యంకానిరీతిలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకేరోజు వీరిద్దరూ ఓటమి మూటగట్టుకొని ఇంటిదారి పట్టారు. ఫలితంగా సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రోజూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి.
 
  డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా 2-6, 2-6తో ప్రపంచ 35వ ర్యాంకర్, 20 ఏళ్ల గార్బిన్ ముగురుజా (స్పెయిన్) చేతిలో... ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ 6-2, 3-6, 4-6తో ప్రపంచ 56వ ర్యాంకర్, 19 ఏళ్ల అనా ష్కిమిద్లోవా (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ ‘డ్రా’ ప్రకారం వీనస్, సెరెనా ఇద్దరూ మూడో రౌండ్‌లో ముఖాముఖిగా తలపడాల్సింది. అయితే ఈ ఇద్దరూ రెండో రౌండ్‌లోనే ఓడిపోవడంతో అభిమానులకు 25వ సారి అక్కా, చెల్లెలు పోరును ఆస్వాదించే అవకాశం దక్కలేదు.
 
 మరోవైపు 12వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 7-5, 4-6, 2-6తో జోనా లార్సన్ (స్వీడన్) చేతిలో ఓడింది.
 
 ఏడో సీడ్ షరపోవా 7-5, 6-2తో పిరన్‌కోవా (బల్గేరియా)పై; ఎనిమిదో సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-2, 7-5తో లెప్‌చెంకో (అమెరికా)పై, 18వ సీడ్ బౌచర్డ్ (కెనడా) 2-6, 6-2, 6-1తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచారు.
 
 గార్బిన్‌తో 64 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 32 ఏళ్ల సెరెనా ఏ దశలోనూ పైచేయి సాధించలేదు. 5 డబుల్ ఫాల్ట్‌లు, 29 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌వద్దకు ఐదుసార్లు దూసుకొచ్చినా ఒక్కసారీ పాయింట్ సాధించలేదు. గార్బిన్ మాత్రం దూకుడుగా ఆడుతూ సెరెనా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడంతోపాటు, నెట్‌వద్ద ఏడుసార్లు వచ్చి ఐదు పాయింట్లు నెగ్గింది.
 
 ష్కిమిద్లోవాతో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 33 ఏళ్ల వీనస్ తొలి సెట్‌ను నెగ్గినా ఆ తర్వాత తడబడింది. మ్యాచ్ మొత్తంలో 47 అనవసర తప్పిదాలు చేసిన వీనస్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది.
 
 ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ (సెరెనా), రెండో సీడ్ (నా లీ) క్రీడాకారిణులిద్దరూ మూడో రౌండ్‌కు చేరుకోకపోవడం ఇదే తొలిసారి.
 
 తన కెరీర్‌లో సెరెనా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లో అత్యల్పంగా నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా టాప్ సీడ్ హోదాలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోకపోవడం ఇదే ప్రథమం.
 
 గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒకే రోజున వీనస్, సెరెనా ఓడిపోవడం ఇది నాలుగో పర్యాయం. గతంలో 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో (క్వార్టర్ ఫైనల్), 2008 ఫ్రెంచ్ ఓపెన్‌లో (మూడో రౌండ్), 2011 వింబుల్డన్ (ప్రిక్వార్టర్ ఫైనల్) వీరిద్దరూ ఒకేరోజు ఓడిపోయారు.
 
 జొకోవిచ్, ఫెడరర్ ముందంజ
 పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) మూడో రౌండ్‌కు చేరుకున్నారు.
 
 రెండో రౌండ్‌లో జొకోవిచ్ 6-1, 6-4, 6-2తో జెరెమి చార్డీ (అమెరికా)పై, ఫెడరర్ 6-3, 6-4, 6-4తో సెబాస్టియన్ ష్వావార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై, బెర్డిచ్ 6-7 (4/7), 6-4, 7-5, 6-3తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)పై, రావ్‌నిక్ 7-6 (7/4), 6-4, 6-1తో వాసెలీ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు. 13వ సీడ్ సోంగా (ఫ్రాన్స్), 17వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్), 18వ సీడ్ గుల్బిస్ (లాత్వియా), 25వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. అయితే 15వ సీడ్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా) 0-6, 3-6, 6-3, 4-6తో స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో, 20వ సీడ్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్) 6-1, 6-3, 3-6, 0-6, 2-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement