లండన్: మహమ్మారి దెబ్బకు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రద్దయ్యింది. ఇందులో విశేషమేమీ లేదు ఎందుకంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్సే ఈ ఏడాది జరగడం లేదు. దాంతో పోల్చితే వింబుల్డన్ ఓ టెన్నిస్ టోర్నీ మాత్రమే! టోక్యో ఈవెంట్ రద్దు కాకపోయినా వాయిదా వల్లే జపాన్ కోట్ల నష్టం చవిచూడనుంది. కానీ వింబుల్డన్ రద్దయినా పైసా నష్టం లేదు. కోట్ల రూపాయలు రానున్నాయి. చిత్రంగా ఉన్నా... ఇది నిజంగా నిజమే! ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ముందుచూపు వారి కొంప మునగకుండా చేసింది. కొన్నేళ్లుగా టోర్నీకి బీమా చేయించింది. అయితే కరోనా కొత్త వైరస్ దీంతో బీమా చెల్లింపులు జరగవనుకుంటే పొరపాటే! ఎందుకంటే నిర్వాహకులు దూరదృష్టితో ఆలోచించారు. ఏదో బీమా చేశాంలే అని ‘మమ’ అనిపించలేదు. పాలసీలో ఎండవానలు–ప్రకృతి వైపరీత్యాలు, బంద్‌లు ఇలా అన్నింటిని ఒప్పందంలో చేర్చారు. అలాగే వైరస్, మహమ్మారిల వల్ల కూడా ఆట రద్దయినా బీమా వర్తించాల్సిందేనన్న ‘క్లాజ్’ను చేర్చారు. ఇప్పుడు ఈ క్లాజే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు శ్రీరామరక్ష అయ్యింది.
కోవిడ్–19 మహమ్మారి వల్ల రద్దయిన టోర్నీకి సదరు బీమా సంస్థ డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో అక్షరాల రూ.1064 కోట్ల (141 మిలియన్ డాలర్లు) బీమా మొత్తం ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు రానున్నాయి. దీనిపై క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రిచర్డ్ లూయిస్ మాట్లాడుతూ ‘మేం ముందుజాగ్రత్తగా తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసే మాకు అండగా నిలిచింది. ఇన్సూరెన్స్ సంస్థ, మధ్యవర్తులు ఇలా చాలా మంది ఈ వ్యవహారంలో కలిసి పనిచేశారు. అందుకే పూర్తిస్థాయి బీమా (ఫుల్ ఇన్సురెన్స్) సాధ్యమైంది. అయితే పాలసీ సొమ్ము అందేందుకు సమయం పడుతుంది. పేపర్ వర్క్ పూర్తవ్వాలి’ అని అన్నారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం 2002లో సార్స్ వైరస్ వెలుగు చూసింది. దీంతో 2003నుంచి బీమా పరిధిలోకి వైరస్, ప్రపంచాన్ని వణికించే మహమ్మారిలను కూడా చేర్చారు. గత 17 ఏళ్లుగా ఏడాదికి 2 మిలియన్ డాలర్ల చొప్పున 2019 వరకు నిర్వాహకులు ఇన్సూరెన్స్ కోసం మొత్తం 34 మిలియన్ డాలర్లు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment