లండన్: ప్రతిష్టాత్మక ‘విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్’ అవార్డుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. వరుసగా మూడో ఏడాది అతనికి ‘లీడింగ్ క్రికెటర్’ అవార్డు దక్కింది. ఈ అవార్డును మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డాన్ బ్రాడ్‌మన్ (10 సార్లు), జాక్ హాబ్స్ (8 సార్లు) మాత్రమే గెలుచుకోగా...ఇప్పుడు ఆ జాబితాలో కోహ్లి చేరడం విశేషం. 2018లో మూడు ఫార్మాట్‌లలో కలిపి కోహ్లి ఏకంగా 2735 పరుగులు సాధించాడు. విజ్డన్ ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కోహ్లి ఉండగా... ఇంగ్లండ్‌కు చెందిన ట్యామీ బీమాంట్, జాస్ బట్లర్, స్యామ్ కరన్, రోరీ బర్న్స్‌లు మిగతావారు.
గత ఏడాది ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 59.3 సగటుతో 593 పరుగులు చేశాడు. మహిళల విభాగంలో స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ‘లీడింగ్ క్రికెటర్’గా ఎంపికైంది. గత ఏడాది స్మృతి వన్డేల్లో 669, టి20ల్లో 662 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌లో జరిగిన మహిళల సూపర్ లీగ్ టోర్నీలో ఆమె అద్భుతంగా ఆడి 174.68 స్ట్రైక్‌రేట్‌తో 421 పరుగులు సాధించింది. అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వరుసగా రెండో ఏడాది ‘లీడింగ్ టి20 క్రికెటర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. విజ్డన్ సంస్థ 1889నుంచి ప్రతి ఏటా అత్యుత్తమ క్రికెటర్ అవార్డులను ప్రకటిస్తోంది. క్రికెట్ ప్రపంచంలో ఈ గుర్తింపును ప్రత్యేకంగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment