
జొకోవిచ్ కు మరో షాక్
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కు మరో షాక్ తగిలింది. ఆదివారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన జొకోవిచ్.. రోజు గడవకముందే మరో ఓటమిని ఎదుర్కొన్నాడు. సోమవారం అర్థరాత్రి జరిగిన పురుషుల డబుల్స్లో జొకోవిచ్- నెనాడ్ జిమానిక్ జోడి పరాజయం చవిచూసింది.
రెండో రౌండ్ లో భాగంగా జొకోవిచ్ జంట 4-6, 4-6 తేడాతో ఆతిథ్య బ్రెజిల్కు చెందిన నాల్గో సీడ్ మార్సెలో మీలో-బ్రూనో సోర్స్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది. గతంలో 2008 ఒలింపిక్స్లో మాత్రమే కాంస్య పతకం సాధించిన జొకోవిచ్.. ఆ తరువాత లండన్ ఒలింపిక్స్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రియో ఒలింపిక్స్ నుంచి ఆదిలోనే టాప్ సీడ్లు వెనుదిరగడంతో ఆ మెగా ఈవెంట్ లో కాస్త కళ తప్పినట్లు కనబడుతోంది. ఇప్పటికే మహిళల డబుల్స్లో సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ జోడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.