క్రీడాకుసుమం రమాదేవి | Women Coach Ramadevi Talent In Cricket West Godavari | Sakshi
Sakshi News home page

క్రీడాకుసుమం రమాదేవి

Published Mon, Oct 8 2018 1:14 PM | Last Updated on Mon, Oct 8 2018 1:14 PM

Women Coach Ramadevi Talent In Cricket West Godavari - Sakshi

ఇండియన్‌ మాజీ కెప్టెన్‌ ధోనీతో రమాదేవి,బౌలింగ్‌లో మెలకువలు నేర్పుతున్న రమాదేవి

పశ్చిమగోదావరి, ఏలూరు రూరల్‌ : ఒకనాడు గల్లీ క్రికెట్‌ ఆడిన ఓ బాలిక నేడు ఆంధ్ర క్రికెట్‌ మహిళ జట్టుకు కోచ్‌గా రాణిస్తోంది. అంతే కాదు గ్రామీణ బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్ది జిల్లా జట్టుకు అద్భుత విజయాలు అందిస్తోంది. జెంటిల్‌మెన్‌ క్రీడను జెంటిల్‌ఉమెన్‌ క్రీడగా మార్చేస్తోంది. ఆమె భీమవరం మండలం రాయలం గ్రామస్తులు రాజు, వెంకటలక్ష్మీ కుమార్తె సంపాద రమాదేవి. ప్రాణంగా బావించిన క్రికెట్‌ను జీవనంగా మార్చుకుంది.  

నేడు జిల్లా బాలికల క్రికెట్‌ జట్లు సాధిస్తున్న విజయాల వెనక కోచ్‌ రమాదేవి కృషి దాగి ఉంది. ఆమె వద్ద శిక్షణ పొందుతున్న అనేకమంది జిల్లా బాలికలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. జిల్లా, జోన్, రాష్ట్రస్థాయి పోటీల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్ర జట్టులో సైతం చోటు సాధించారు. జెంటిల్‌మెన్‌ క్రీడగా పేరు పొందిన క్రికెట్‌ను జెంటిల్‌ ఉమెన్‌ క్రీడగా మార్చేస్తోంది. 2017లో అండర్‌–19 ఆలిండియా చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్ర జట్టును విజయపథంలో నిలిపి రూ.10 లక్షల నగదు బహుమతిని అందించింది. గత నాలుగేళ్లుగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ దేవరపల్లి, దుద్దుకూరు, ఏలూరు, గూటాల, రామన్నపాలెంలో సుమారు 61 మంది గ్రామీణ బాల బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్దింది. మహిళా కోచ్‌గా ఈమె సాధిస్తున్న విజయాలను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సైతం గుర్తించి ఇటీవల ఆ«ంధ్ర మహిళల టీ20 జట్టుకు శిక్షకురాలుగా నియమించింది. ఇప్పటికే రమాదేవి ఏసీఎ లెవెల్‌–1 ఎ గ్రేడ్, ఎన్‌సీఎ లెవెన్‌–1లో పాల్గొంది.

క్రీడాకారిణిగా విజయాలు
చిన్నప్పుడు అన్నయ్యతో కలిసి గల్లి క్రికెట్‌ ఆడిన రమాదేవి క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ జిల్లాస్థాయి నుంచి ఆంధ్ర జట్టు స్థాయికి ఎదిగింది. అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23, సీనియర్‌ విభాగాల్లో ఆంధ్ర జట్టుకు అనేకసార్లు ప్రాతినిధ్యం వహించింది. జిల్లా సీనియర్‌ జట్టుకు 13 ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించింది. అండర్‌–19 రాష్ట్ర జట్టులో 3 ఏళ్లు, సీనియర్‌ జట్టులో–8 ఏళ్ల పాటు క్రీడాకారిణిగా కొనసాగడం విశేషం. 5 వికెట్లు చొప్పున 9 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీసి అభిమానులను అబ్బురపరిచింది. 700 వికెట్లు, 75కు పైగా హాఫ్‌సెంచరీలు, 4 సెంచరీలు చేసి బాలికల్లో స్ఫూర్తి నింపి ఆటపై మక్కువ కలిగేలా చేసింది.

నా శిష్యులనుజాతీయజట్టులో చూడాలి
కనీసం 5గురు జిల్లా బాలికలు జాతీయజట్టులో చోటు సాధించేలా కృషి చేయడమే నా జీవిత లక్ష్యం. అందుకోసమే నేను కోచింగ్‌ను వృత్తిగా చేసుకున్నాను. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో నా లక్ష్యం నెరవేర్చుకుంటా. క్రికెట్‌ అంటే కేవలం మగపిల్లలకే కాదు. ఆడపిల్లలు కూడా ఆడేలా పెద్దలు ప్రోత్సహించాలి.– రమాదేవి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement