గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారత బ్యాడ్మింటన్‌కు గొప్ప విజయాలు లభించలేదు. కామన్వెల్త్ గేమ్స్ ఫలితాలను మినహాయిస్తే అంతర్జాతీయ వేదికలపై మెగా టోర్నమెంట్‌లలో మనోళ్ల మెరుపులు అంతగా కనిపించలేదు. అయితే ఈ ప్రతికూల ఫలితాలను వెనక్కినెట్టే అవకాశం భారత అగ్రశ్రేణి షట్లర్లకు ప్రపంచ చాంపియన్‌షిప్ రూపంలో లభించింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు రజతం, సైనా కాంస్యం సాధించగా... అలాంటి ఫలితాలను ఈసారి పునరావృతం చేస్తారో లేదో వేచి చూడాలి. ఇక పురుషుల సింగిల్స్‌లో 35 ఏళ్ల పతక నిరీక్షణకు ముగింపు పలికేందుకు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ సిద్ధమయ్యారు.
నాన్‌జింగ్ (చైనా): కొంతకాలంగా ప్రముఖ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించాలనే పట్టుదలతో పీవీ సింధు... మూడోసారి పతకం సాధించాలనే లక్ష్యం తో సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తోన్న పతకాన్ని దక్కించుకోవాలనే తాపత్రయంతో శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ... ఈ నేపథ్యంలో సోమవారం మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు భారీ అంచనాలతో బరిలోకి దిగనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ విభాగాలలో కలిపి మొత్తం 25 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సెమీఫైనల్ చేరిన వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి.
గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి పెను సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఈసారి అతని పార్శ్వంలో ఉన్న మలేసియా దిగ్గజం లీ చోంగ్ వీ చివరి నిమిషంలో గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో శ్రీకాంత్ తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే సెమీస్ చేరుకోవడం కష్టమేమీకాదు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 86వ ర్యాంకర్ ఎన్‌హాట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్ తలపడతాడు. అంతా సాఫీగా సాగితే రెండో రౌండ్‌లో పాబ్లో అబియాన్ (స్పెయిన్), ప్రిక్వార్టర్ ఫైనల్లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), క్వార్టర్ ఫైనల్లో లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)లతో శ్రీకాంత్ ఆడే అవకాశముంది.
మరోవైపు తొలి రౌండ్‌లో సాయిప్రణీత్‌తో తలపడాల్సిన నాలుగో సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో సాయిప్రణీత్ నేరుగా రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగే రెండో రౌండ్‌లో లూయిస్ ఎన్రిక్ (స్పెయిన్)తో సాయిప్రణీత్ ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ పీవీ సింధు, పదో సీడ్ సైనా నెహ్వాల్‌లకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. మంగళవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో దెమిర్‌బాగ్ (టర్కీ)తో సైనా... ఫిత్రియాని (ఇండోనేసియా), లిండా జెట్‌చిరి (బల్గేరియా) మ్యాచ్ విజేతతో సింధు తలపడతారు. ‘డ్రా’ ప్రకారం సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా), క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) ఎదురుకావొచ్చు.
భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్
►పురుషుల సింగిల్స్: ప్రణయ్ గీ అభినవ్ (న్యూజి లాండ్); సమీర్ వర్మ గీ లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)
►పురుషుల డబుల్స్: సుమీత్, మనూ అత్రి గీ నికొలోవ్, రుసేవ్ (బల్గేరియా)
►మిక్స్‌డ్ డబుల్స్: సాత్విక్, అశ్విని గీ నిక్లాస్, సారా (డెన్మార్క్); సిక్కి రెడ్డి, ప్రణవ్ గీ బిట్‌మాన్, బసోవా (చెక్ రిపబ్లిక్); సౌరభ్, అనౌష్క గీ ఎనెజో, పీస్ (నైజీరియా); రోహన్, కుహూ గీ టోబీ, రాచెల్ (కెనడా)
►మహిళల డబుల్స్: సంయోగిత, ప్రజక్తా గీ నాజ్లికన్, బెంగిసు (టర్కీ)
Comments
Please login to add a commentAdd a comment