అందరి దృష్టి బోల్ట్ పైనే!
బీజింగ్: గత ఏడేళ్లుగా 100 మీటర్ల విభాగంలో పరాజయమెరుగని జమైకా విఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మరోసారి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈ ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రోజున హీట్స్... ఆదివారం సెమీఫైనల్స్, ఫైనల్ రేసు జరుగుతాయి. బీజింగ్ ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచిన బర్డ్స్‌నెస్ట్ స్టేడియంలోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు సాధించాడు.
2011లో ప్రపంచ చాంపియన్‌షిప్ 100 మీటర్ల ఫైనల్లో ఫాల్స్ స్టార్ట్ మినహా బోల్ట్ 2008 నుంచి ఈ విభాగంలో అజేయుడుగా ఉన్నాడు. ఈసారి బోల్ట్‌కు అమెరికా స్టార్స్ జస్టిన్ గాట్లిన్, టైసన్ గేల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ‘ఈ నగరంతో నాకు గొప్ప అనుబంధం ఉంది. మళ్లీ ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. నేను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. తొలిరోజు మూడు విభాగాల్లో ఫైనల్స్ (పురుషుల మారథాన్, 10,000 మీ., మహిళల షాట్‌పుట్ ) జరుగుతాయి.