ఆనంద్ తొలి గేమ్ నల్లపావులతో
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను నల్ల పావులతో ఆరంభించనున్నాడు. 12 రౌండ్ల పాటు జరిగే ఈ పోరులో ఆనంద్ నార్వేకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో పోటీపడనున్నాడు. ఈనెల 9 నుంచి 28 వరకు స్థానిక హయత్ రీజెన్సీ హోటళ్లో పోటీ జరుగుతుంది. ఫిడే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన తమిళనాడు సీఎం జయలలిత డ్రా తీశారు.
తొలి బౌల్ నుంచి ఆనంద్ ఫొటోను, ఇంకో బౌల్ నుంచి నల్ల పావును బయటికి తీశారు. వెంటనే అక్కడున్న ప్రేక్షకులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ డ్రా ఫలితంతో ఆనంద్ వరుసగా ఆరు, ఏడు గేమ్‌ల్లో తెల్ల పావులతో ఆడే అవకాశం చిక్కనుంది. నిబంధనల ప్రకారం తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడే ఆటగాడు ఏడో గేమ్‌లో నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. 2000, 2007, 2008, 2010 ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలుచుకున్న సమయంలో ఆనంద్ నల్ల పావులతోనే ఆటను ప్రారంభించాడు. 2012లో మాత్రం తెల్ల పావులతో ఆడాడు.
‘భారత్ నుంచి ఆనంద్ అత్యుత్తమ ఆటగాడు’
జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను గురువారం ముఖ్యమంత్రి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇరువురు ఆటగాళ్లతో పాటు ఫిడే అధ్యక్షుడు కిర్సన్ ఇల్యుమ్‌జినోవ్ తదితరులు హాజరయ్యారు. ఏడుగురు వర్ధమాన చెస్ ఆటగాళ్లు ఆనంద్, కార్ల్‌సెన్‌లను వెంటబెట్టుకుని వేదికపైకి తీసుకొచ్చారు. వీరికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. ‘దేశంలో చెస్‌కు పర్యాయపదం ఆనంద్. అంతేకాకుండా ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. ఇంతటి అద్భుత ఆటగాడు చెన్నై నుంచి ఎదగడం అమితానందాన్ని కలిగిస్తోంది’ అని జయలలిత కొనియాడారు. కార్ల్‌సెన్‌ను చెస్ మేధావిగా అభివర్ణించారు.
దూకుడునే కొనసాగిస్తా..
ఆరో ప్రపంచ చాంపియన్ టైటిల్ సాధించేందుకు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోరులో తన ప్రత్యర్థిపై దూకుడు మంత్రాన్ని ప్రయోగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 22 ఏళ్ల ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌తో ఆనంద్‌కు గట్టి పోటీనే ఎదురుకాబోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన కార్ల్‌సెన్.. ఆనంద్‌తో పోటీపడే అర్హత సాధించాడు.
గురువారం నాటి విలేకరుల సమావేశంలో ఆనంద్ తన సన్నాహకాలను వివరించాడు. ‘ఎప్పటిలాగే ఈ ఈవెంట్‌కు కూడా కఠినంగానే సన్నద్ధమవుతున్నాను. కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాను. అందుకే బరిలోకి దిగేందుకు నేను సిద్ధంగా ఉన్నానని భావిస్తున్నాను. పోటీ ఎలా ఉంటుందో మున్ముందు చూస్తారు. సొంత నగరంలో ఆడడం చాలా ఉత్సుకతగా ఉంది. దీనికి కారణం సీఎం జయలలిత. ఆమె పట్టుదల కారణంగానే ఈ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది’ అని ఆనంద్ అన్నాడు.
ఆనంద్ టీమ్ ఇదీ...
అత్యంత ఆసక్తికరంగా సాగే ఈ మెగా టోర్నీలో ఆనంద్ తన సహాయకుల పేర్లను ప్రకటించాడు. వీరిలో ఇద్దరు భారత ఆటగాళ్లున్నారు. కె.శశికిరణ్, సాందీపన్ చందాలకు ఇందులో చోటు దక్కింది. ఇక రెగ్యులర్‌గా ఉండే రడోస్లావ్ వొటస్జెక్ (పోలండ్), గతంలో ఆనంద్‌తో చాలాసార్లు తలపడిన పీటర్ లెకో (హంగేరి) కూడా ఆనంద్ బృందంలో ఉన్నారు.
నేను చెప్పను: కార్ల్‌సెన్
మరోవైపు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్‌సెన్ మాత్రం తన టీమ్‌ను బహిర్గతపరచలేదు. ‘ఆనంద్ జట్టు సభ్యులను అభినందిస్తున్నాను. అయితే నా వారి గురించి చెప్పను. భారత్‌లో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.