కార్డిఫ్ : పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఇంగ్లండ్.. సంచలనాల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా విరుచుకుపడింది. దీంతో బంగ్లా 106 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన బంగ్లా-ఇంగ్లండ్ మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించింది. తొలుత జేసన్ రాయ్ (153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం షకీబుల్ హసన్(121; 119 బంతుల్లో 12ఫోర్లు, 1 సిక్సర్)వీరోచితంగా పోరాడినప్పటికీ బంగ్లాకు విజయాన్ని అందించలేకపోయాడు. షకీబ్ మినహా ఏవరూ రాణించకపోవడంతో బంగ్లా 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారీ శతకంతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం అందించడంలో మరోసారి విఫలమయ్యారు. ఆర్చర బౌలింగ్‌లో సౌమ్య సర్కార్(2) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం తమీమ్(19) తన చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. ఈ తరుణంలో సీనియర్ ఆటగాళ్లు షకీబ్, రహీమ్‌లు మరోసారి బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆది నుంచి షకీబ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. రహీమ్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించిన అనంతరం ప్లంకెట్ బౌలింగ్‌లో రహీమ్(44) వెనుదిరుగుతాడు.
అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా షకీబ్ తన ఒంటరి పోరాటం కొనసాగించాడు. టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్‌లో ఎనిమిదో శతకం సాధించాడు. అనంతరం స్కోర్ పెంచే క్రమంలో షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా ఓటమి లాంఛనమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ తలో మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేసన్ రాయ్(153; 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి తోడు బెయిర్ స్టో(51; 50 బంతుల్లో 6 ఫోర్లు), జోస్ బట్లర్(64; 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. తాజా మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహిదీ హసన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్తజా, ముస్తాఫిజుర్‌లకు చెరో వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment