T20 World Cup 2021: England Beat Bangladesh By 8 Wickets
Sakshi News home page

T20 World Cup 2021 Eng Vs Ban: బంగ్లా విలవిల.. సెమీస్‌ దిశగా ఇంగ్లండ్‌

Published Thu, Oct 28 2021 8:14 AM | Last Updated on Thu, Oct 28 2021 1:39 PM

T20 World Cup 2021: England Beat Bangladesh By 8 Wickets - Sakshi

England Beat Bangladesh By 8 Wickets Closer To Semis: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చెలరేగుతోంది. గ్రూప్‌–1లో అదరగొట్టే విజయాలతో ప్రత్యర్థులను బెదరకొట్టేస్తోంది. వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్‌ దిశగా మరో అడుగు వేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ను చిత్తు చేసిన మోర్గాన్‌ బృందం రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దెబ్బకొట్టింది.

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ అసాధారణ ప్రదర్శనతో దూసుకెళుతోంది. బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. స్పిన్, పేస్, మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుపై అల్‌రౌండ్‌ పిడుగులు కురిపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరు!

ఇంకెవరినీ ఇంగ్లండ్‌ బౌలర్లు 20 పరుగులైనా చేయనివ్వలేదు. టైమల్‌ మిల్స్‌ మూడు, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్‌ 14.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేసన్‌ రాయ్‌ (38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు.   

ఇంగ్లండ్‌ ‘పవర్‌’ప్లే... బంగ్లా డీలా! 
బంగ్లాకు టాస్‌ గెలిచిన ఆనందం బ్యాటింగ్‌కు దిగగానే ఆవిరైంది. కలిసొచ్చే పిచ్‌పై ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ తిప్పేశాడు. పేసర్‌ మిల్స్‌ కట్టడి చేశాడు. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (9), నైమ్‌ (5)లను అలీ వరుస బంతుల్లోనే పెవిలియన్‌ చేర్చగా, షకీబ్‌ (4)ను వోక్స్‌ ఔట్‌ చేశాడు. దీంతో ‘పవర్‌ ప్లే’లో బంగ్లా మూడు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్లను కోల్పోతూనే ఇన్నింగ్స్‌ కుదేలైంది.

ముష్ఫికర్‌ ఉన్నంతసేపు 10 ఓవర్లలో 6 పరుగుల రన్‌రేట్‌ కనిపించింది. 11వ ఓవర్లో 63 పరుగుల స్కోరు వద్ద అతన్ని లివింగ్‌స్టోన్‌ ఎల్బీగా పంపడంతో వికెట్ల పతనం మళ్లీ జోరందుకుంది.  బ్యాటింగ్‌లో తల్లడిల్లిన బంగ్లా బౌలింగ్‌లో అయితే డీలా పడింది. ఓపెనర్‌ రాయ్‌ అటాకింగ్‌కు చెల్లాచెదురైంది. మరో ఓపెనర్‌ బట్లర్‌ (18; ఫోర్, సిక్స్‌)ను తక్కువ స్కోరుకే ఔట్‌ చేసిన బంగ్లాకు అదే తృప్తి మిగిలింది.   

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) మొయిన్‌ అలీ 9; నైమ్‌ (సి) వోక్స్‌ (బి) మొయిన్‌ అలీ 5; షకీబ్‌ (సి) రషీద్‌ (బి) వోక్స్‌ 4; ముష్ఫికర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లివింగ్‌స్టోన్‌ 29; మహ్ముదుల్లా (సి) వోక్స్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 19; ఆఫిఫ్‌ (రనౌట్‌) 5; నూరుల్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 16; మెహదీ హసన్‌ (సి) వోక్స్‌ (బి) మిల్స్‌ 11; నజుమ్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 19; ముస్తఫిజుర్‌ (బి) మిల్స్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 124.
వికెట్ల పతనం: 1–14, 2–14, 3–26, 4–63, 5–73, 6–83, 7–98, 8–124, 9–124. బౌలింగ్‌: మొయిన్‌ అలీ 3–0–18–2, వోక్స్‌ 4–0–12–1, రషీద్‌ 4–0–35–0, జోర్డాన్‌ 2–0–15–0, టైమల్‌ మిల్స్‌ 4–0–27–3, లివింగ్‌స్టోన్‌ 3–0–15–2. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) నజుమ్‌ అహ్మద్‌ (బి) షోరిఫుల్‌ ఇస్లామ్‌ 61; బట్లర్‌ (సి) నైమ్‌ (బి) నజుమ్‌ అహ్మద్‌ 18; మలాన్‌ (నాటౌట్‌) 28; బెయిర్‌స్టో (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో 2 వికెట్లకు) 126. 
వికెట్ల పతనం: 1–39, 2–112. బౌలింగ్‌: షకీబ్‌ 3–0–24–0, ముస్తఫిజుర్‌ 3–0–23–0, షోరిఫుల్‌ ఇస్లామ్‌ 3.1–0–26–1, నజుమ్‌ అహ్మద్‌ 3–0–26–1, మెహదీ హసన్‌ 2–0–21–0.

చదవండి: T20 World Cup 2021: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను: వార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement