జేసన్ రాయ్ మెరుపులు.. ఇంగ్లండ్ ఘన విజయం
సమయం 18: 33.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్(38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకంతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 14.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఆరంభంలోనే జోస్ బట్లర్(18 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) ఔటైనప్పటికీ.. డేవిడ్ మలాన్(25 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) సహకారంతో రాయ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరో బెయిర్‌స్టో(4 బంతుల్లో 8 నాటౌట్; ఫోర్) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. జేసన్ రాయ్(61) ఔట్
సమయం 18: 23.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ జేసన్ రాయ్(38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును దాదాపుగా విజయతీరాలకు చేర్చాక పెవిలియన్ బాట పట్టాడు. షొరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో నసుమ్ అహ్మద్ క్యాచ్ పట్టడంతో రాయ్ ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 114/2. క్రీజ్‌లో మలాన్(22), బెయిర్‌స్టో(2) ఉన్నారు. న్యూజిలాండ్ గెలవాలంటే 7 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే చేయాలి.
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్(18) ఔట్
సమయం 17: 45.. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 5వ ఓవర్ ఐదో బంతికి తొలి వికెట్ కోల్పోయింది. నసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో నయీమ్ క్యాచ్ పట్టడంతో బట్లర్(18 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 40/1. క్రీజ్‌లో జేసన్ రాయ్(12 బంతుల్లో 18), డేవిడ్ మలాన్ ఉన్నారు.
దారుణంగా విఫలమైన బంగ్లా బ్యాటర్లు.. ఇంగ్లండ్ ముందు స్వల్ప లక్ష్యం
సమయం 17: 16.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మరోసారి దారుణంగా విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. తైమాల్ మిల్స్ ఆఖరి ఓవర్లో పొదుపుగా బౌల్ చేసి చివరి రెండు బంతుల్లో వికెట్లు తీశాడు. 19.5వ ఓవర్లో బట్లర్ క్యాచ్ పట్టడంతో నరుల్ హసన్(18 బంతుల్లో 16) పెవిలియన్ చేరగా.. ఆఖరి బంతికి ముస్తాఫిజుర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్ 3 వికెట్లతో చెలరేగగా.. లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు, క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
98 పరుగుల వద్ద బంగ్లా ఏడో వికెట్ డౌన్
సమయం 16: 57.. 17.1వ ఓవర్లో బంగ్లా జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. తైమాల్ మిల్స్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మెహిది హసన్(10 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 102/7. క్రీజ్‌లో నరుల్ హసన్(12), నసుమ్ అహ్మద్(3) ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. కెప్టెన్ ఔట్
సమయం 16: 46.. ఇన్నింగ్స్ 14.5వ ఓవర్లో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మదుల్లా(24 బంతుల్లో 19; ఫోర్) వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 86/6. క్రీజ్‌లో నరుల్ హసన్(7), మెహిది హసన్ ఉన్నారు.
73 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 16: 34.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుండడంతో బంగ్లా జట్టు ఒత్తిడికి లోనవుతుంది. దీంతో అనవసర పరుగుకు ప్రయత్నించి మరో వికెట్ చేజార్చుకుంది. 12.4వ ఓవర్లో అఫీఫ్ హొసేన్(6 బంతుల్లో 5; ఫోర్) రనౌట్‌గా వెనుదిరగడంతో 73 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(17), నరుల్ హసన్ ఉన్నారు.
కష్టాల్లో బంగ్లాదేశ్.. 63 పరుగులకే 4 వికెట్లు డౌన్
సమయం 16: 25.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి బంగ్లా జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్ నాలుగో బంతికి లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్(30 బంతుల్లో 29; 3 ఫోర్లు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(13), అఫీఫ్ హొసేన్ ఉన్నారు.
10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 60/3
సమయం 16: 18.. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న బంగ్లాదేశ్‌ను ముష్పికర్ రహీమ్(27 బంతుల్లో 27; 3 ఫోర్లు), మహ్మదుల్లా(11 బంతుల్లో 12; ఫోర్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 60/3గా ఉంది.
పెవిలియన్‌కు క్యూ కడుతున్న బంగ్లా బ్యాటర్లు
సమయం 15:55.. మొయిన్ అలీ వేసిన రెండో ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో మరో వికెట్ కోల్పోయింది. వోక్స్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి షకీబ్ అల్ హసన్(7 బంతుల్లో 4) పెవిలియన్ బాట పట్టాడు. 5.2 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 26/3. క్రీజ్లో ముష్ఫికర్ రహీమ్(8), కెప్టెన్ మహ్మదుల్లా ఉన్నారు.
ఆదిలోనే బంగ్లాదేశ్‌కు షాక్.. వరుస బంతుల్లో వికెట్లు తీసిన మొయిన్ అలీ
సమయం 15:41.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ వరుస బంతుల్లో లిటన్ దాస్(8 బంతుల్లో 9; 2 ఫోర్లు), మహ్మద్ నయీమ్(7 బంతుల్లో 5)ల వికెట్లు పడగొట్టాడు. దీంతో బంగ్లా 3 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో ముష్ఫికర్ రహీమ్(1), షకీబ్ అల్ హసన్ ఉన్నారు.
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్‌పై భారీ విజయం సాధించగా.. బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది.
పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా.. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఈ నాలుగు మ్యాచ్‌లు టీ20 ప్రపంచకప్‌లలో తలపడినవే కావడం విశేషం. ఇక ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) ఇంగ్లండ్ ఓసారి ఛాంపియన్(2010)గా, మరోసారి రన్నరప్(2016)గా నిలువగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2007లో సూపర్-8 దశకు చేరడమే ఆ జట్టుకు అత్యుత్తమం.
తుది జట్లు:
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్), డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, తైమాల్ మిల్స్
బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), నరుల్ హసన్(వికెట్‌కీపర్), మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment